మండలంలో మూడు కొనుగోలు కేంద్రాల ద్వారా 23,557 క్వింటాళ్ల వరి ధాన్యం సేకరణ
పెద్దేముల్, డిసెంబర్ 29 : మండలంలో వానకాలం సీజన్లో మొత్తం 2,592 మంది రైతులు 21 గ్రామాల్లో 4,302 ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. పంటలను రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పంటల వారీగా కనీస మద్ధతు ధరలను అందించి ప్రభుత్వమే ధాన్యం కొంటున్నది. ప్రస్తుతం మండలంలో సుమారు మూడు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని కొంటున్నారు.మండలంలో డీసీఎంఎస్ వారి ఆధ్వర్యంలో జనగాం, మంబాపూర్ గ్రామాల్లో, ఐకేపీ వారి ఆధ్వర్యంలో మన్సాన్పల్లి గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జనగాం కేంద్రంలో 155 మంది రైతుల నుంచి 7,773 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని, మంబాపూర్ కొనుగోలు కేంద్రం లో 295 మంది రైతుల నుంచి 13,670 క్విం టాళ్ల వరి ధాన్యాన్ని, మన్సాన్పల్లి కొనుగోలు కేంద్రంలో 42 మంది రైతుల నుంచి 2,114 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని సేకరించారు. మొత్తంగా మండలంలో 492 మంది రైతుల నుంచి మూడు కొనుగోలు కేంద్రాల్లో 23,557 క్వింటాళ్ల వరి ధాన్యం సేకరించారు.గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ.1,960 చొప్పున, కామన్ రకానికి రూ.1,940 చొప్పున చెల్లిస్తున్నా రు.ధాన్యంలో ఉన్న తేమ శాతాన్ని బట్టి ధరలలో మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు.