
స్వామినాథన్ కమిషన్ సిఫారసు అమలు చేయాలి
బీహార్ లాగే అన్ని రాష్ర్టాల్లో రైతులు లేకుండా చేస్తారా?
కర్షకుల చైతన్యం కోసమే ‘రైతన్న’ సినిమా
ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి
ఖమ్మం, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మంలోని సీపీఎం కార్యాలయంలో వామపక్ష నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ చట్టాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారనున్నదని, వారు వ్యవసాయానికి దూరం కానున్నారని తెలియజేసేందుకే ‘రైతన్న’ సినిమా తీశానని చెప్పారు. అక్టోబర్ 2న ఖమ్మంలో ఈ సినిమా విడుదల చేస్తున్నామని అందరూ ఆదరించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని 2014 ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ ఇప్పుడు వాటిని ఎందుకు అమలు చేయడం లేదో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలతో రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా మారనుందో, వ్యవసాయానికి రైతులు ఎలా దూరం కానున్నారో కళ్లకు కట్టినట్టుగా తెలియజేసేందుకు అక్టోబర్ 2న ‘రైతన్న’ సినిమా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మంలోని సీపీఎం కార్యాలయంలో వామపక్ష నేతలతో కలిసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆందోళనలో న్యాయం, ధర్మం ఉన్నాయన్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు ఎలా శాపంగా మారుతున్నాయో ఆ సినిమాలో వివరించామన్నారు. దేశానికి వెన్నెముక అంటూనే రైతు వెన్నెముక విరగొట్టే చట్టాలను ప్రయోగించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రైతుల అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా పోరాడుతామని, రైతుల పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర చట్టాలు అమలైతే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ సైతం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల చేతికి వ్యవసాయ రంగాన్ని అప్పగించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉందన్న అభిప్రాయం రైతుల్లో కలుగుతోందన్నారు. విప్లవాల ఖిల్లాగా ఉన్న ఖమ్మంలో రైతన్న సినిమా విజయవంతమై తీరుతుందని అన్నారు. సినిమా సారాంశం రైతు నేపథ్యం కావడంతో ప్రతి రైతు, ప్రతి ప్రేక్షకుడు చూడాలని కోరారు. 36 ఏళ్లుగా సినీరంగంలో ఉన్న తాను అనేక విప్లవ సినిమాలను నిర్మించానని, తన తొలి సినిమా ‘అర్ధరాత్రి స్వతంత్య్రం’ ఖమ్మంలో 300 రోజులు ప్రదర్శితమైందని గుర్తుచేశారు. కేంద్రం ఆ వ్యవసాయ చట్టాలను అమలు చేస్తే దేశమంతా బీహార్ రాష్ట్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2006లో బీహార్ ప్రభుత్వం అక్కడి రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు అక్కడ రైతులే లేకుండాపోయారని, వారంతా కూలీలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు పంటలు పండించే స్వేచ్ఛ, గిట్టుబాటు ధరకు వాటిని అమ్ముకునే స్వేచ్ఛ కల్పించాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతుల పరిస్థితిపై అధ్యయనానికి వేసిన స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అమలు చేయలేదని గుర్తుచేశారు.
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వమైనా ఆ సిఫార్సులను అమలు చేయాలని ప్రధానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. స్వామినాథన్ సిఫార్సులు అమలైతే క్వింటా ధాన్యంపై రైతుకు రూ.4 వేల వరకూ గిట్టుబాటు అవుతుందన్నారు. పత్తి రైతు పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తిని అమ్ముకునేందుకు వెళ్తే సీసీఐ ఎలాంటి కొర్రీలు పెడుతుందోనని రైతులు దిగులు చెందుతున్నారని అన్నారు. మాస్కు ధరించకుండా, విశ్రా ంతి లేకుండా దేశానికి అన్నం పెడుతున్న రైతుకు ప్రభుత్వాలు అండగా ఉండాలని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. రైతన్న సినిమా.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని, ఖమ్మం జిల్లాలోని వామపక్ష పార్టీలు ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని అన్నారు. సీపీఐ, సీపీఎం, ఎన్డీ నేతలు పోటు రంగారావు, బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, ఎర్రా శ్రీకాంత్, బండి రమేశ్, ఎర్రా శ్రీనివాస్, గోకినెపల్లి వెంకటేశ్వరరావు, మం దా వెంకటేశ్వర్లు, విక్రమ్ పాల్గొన్నారు.