ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ కమిటీ సభ్యులు
తాడ్వాయి, జనవరి 29 : మండలపరిధిలోని సంతాయిపేట గ్రామశివారులో ఉన్న శ్రీభీమేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది మాఘ అమావాస్య సందర్భంగా ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేశామని తెలిపారు. ప్రకృతి రమణీయతకు నిలయమైన భీమేశ్వరాలయం అతిప్రాచీన దేవాలయం. ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చెబుతారు. మరికొందరు పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు కొద్దిరోజులు ఇక్కడ ఆగారని.. ఆ సమయంలో పాండవుల్లోఒకరైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని, దీంతో ఈ ఆలయానికి భీమేశ్వరాలయముగా పేరు వచ్చిందని చరిత్ర. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య (మౌని అమవాస్య) రోజున వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. భీమేశ్వరాలయాన్ని తాకుతూ ఉత్తరం నుంచి దక్షిణం వైపు పారుతున్న వాగులో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. వాగు వద్ద స్నానాలు చేసేందుకు, భీమేశ్వరున్ని దర్శనం చేసుకోవడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆలయానికి కామారెడ్డి డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.