
ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం సిటీ, అక్టోబర్ 28: ప్రజల అభిమానాన్ని చూరగొన్న నేత.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని వక్తలు పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెగా రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, కేక్ కటింగ్, పండ్ల పంపిణీల వంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పొంగులేటి అందిస్తున్న ప్రజా, సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో గొప్పవని కొనియాడారు. నగరంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి కలిసి కేక్ కట్ చేశారు. సుమారు వెయ్యి మంది అభిమానులు పాల్గొన్నారు. ఖమ్మం ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో రక్తదాన శిబిరాన్ని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సుమారు 250 మంది రక్తదానం చేశారు. ఖమ్మం టీఆర్ఎస్ నగర నాయకుడు ఖాజా ఆధ్వర్యంలో సుమారు 100 బైకులతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ నగర నాయకుడు దుంపల రవికుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులకు, బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. తాళ్లూరి రాము ఆధ్వర్యంలో అన్నం ఫౌండేషన్‌లోని శరణార్థులకు అన్నదానం చేశారు. ఏఎంసీ మిర్చి యార్డులో కేవీ చారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. 23వ డివిజన్ నాయకుడు దాసరి శివ ఆధ్వర్యంలో మిషన్ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి వృద్ధులకు, చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. అర్వపల్లి శివకుమార్ ఆధ్వర్యంలో స్థానిక అమ్మ అనాథాశ్రమంలో వృద్ధులకు, స్థానికులకు పాల ప్యాకెట్లు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. జీవనసంధ్యా వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు.