జూలై 1 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు
పది రోజుల యాక్షన్ ప్లాన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయండి
కలెక్టర్ కృష్ణభాస్కర్
వీసీ ద్వారా సమీక్షా సమావేశం
కలెక్టరేట్, జూన్ 28: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న నాలుగో విడుత పల్లె ప్రగతి, ఏడో విడుత హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులతో పల్లె ప్రగతి, హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూలై 1 నుంచి నిర్వహించనున్న పల్లె ప్రగతి పది రోజుల యాక్షన్ ప్లాన్‌కు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించి గ్రామాలు, జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేయాలని, వాటికి సంబంధించిన వివరాలను పంచాయతీ రిజిస్టర్లో పొందుపర్చాలన్నారు. మహిళా సంఘాల సభ్యుల సహకారంతో పండుగ వాతావరణంలో మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలని సూచించారు. పరిసరాలను శుభ్రం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు మహిళా సంఘాల సభ్యుల సహకారం తీసుకోవాలన్నారు.
గ్రామాల్లో నీటి సరఫరా చేసే ట్యాంకులను శుభ్రం చేయించాలని, పాడుబడిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీలను శుభ్రం చేయించాలన్నారు. ఈ కార్యక్రమాలపై మంగళవారం అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. మండ ల కేంద్రంలో ప్రకృతి వనం నిర్మించేందుకు పదెకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పల్లెల సమగ్రాభివృద్ధికి పట్టం కడుతుందని తెలిపారు. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏడో విడుత హరితహారానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. వీసీలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బీ సత్యప్రసాద్, జడ్పీసీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, పీఆర్ ఈఈ శ్రీనివాస్, డీఏవో రణధీర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు, ఏడీఆర్డీవో మదన్మోహన్ పాల్గొన్నారు.