
మరియమ్మ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ
పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు
ప్రభుత్వ ఉద్యోగిగా మరియమ్మ కుమారుడు
ఉదయ్‌కిరణ్‌కు ఉద్యోగ నియామక పత్రం అందజేత
కుటుంబ సభ్యులకు రూ.35 లక్షల ఆర్థిక సాయం
చింతకాని, జూన్ 28 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోనే దళిత సాధికారిత జరుగుతున్నదని, దళితులను, సబ్బండవర్గాలను టీఆర్ఎస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం చింతకాని మండల పరిధిలో కోమట్లగూడెం గ్రామంలో మరియమ్మ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. పోలీస్‌కస్టడీలో మరణించిన మరియమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మరియమ్మ కుమారుడిని పరామర్శించారు. పోలీసులు వ్యవహరించిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరియమ్మ గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో కలిసి మృతురాలి కుమారుడు ఉదయ్‌కుమార్‌కు ఉద్యోగ నియామకపత్రం అందజేశారు. ఆమె కుమారుడికి రూ.15 లక్షలు, ఇద్దరు కూతుళ్లకు చెరో రూ.10 లక్షల విలువైన చెక్కులను ప్రభుత్వం తరుఫున అందించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ మాట్లాడుతూ మరియమ్మ మృతి బాధాకరమని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలాంటి చర్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. రూ.1200 కోట్లతో దళితుల కోసం సీఎం కేసీఆర్ దళిత సాధికారిత పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో రూ.55 వేల కోట్లు దళితుల కోసం ఖర్చు చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు, సీపీ విష్ణువారియర్, అదనపు కలెక్టర్ మధుసూధన్, రాష్ట్రనాయకులు బొమ్మెర రామ్మూర్తి, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతికిశోర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పెంట్యాల పుల్లయ్య, వైస్‌ఎంపీపీ గురజాల హనుమంతరావు, రైతుబంధు నాయకులు మనోహర్, రమేశ్, సత్యనారాయణ, వెంకటలచ్చయ్య, కుటుంబరావు, నర్సయ్య, సోసైటీ చైర్మన్ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ తిరుమలాచారి, ఎంపీడీఓ రవికుమార్, ఎంపీవో ప్రసాద్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.