
గుర్రంపోడులో వంద ఎకరాల్లో సాగు
ఖమ్మం చక్కెర ఫ్యాక్టరీకి తరలింపు
గుర్రంపోడు, డిసెంబర్ 27 : మండలంలో చెరుకు కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో పలు గ్రామాల రైతులు సుమారు 100 ఎకరాల్లో చెరుకు పండిస్తున్నారు. ప్రస్తుతం చెరుకు గడలను కోసి ఖమ్మం మార్కెట్కు తరలిస్తున్నారు.
మంచి ఆదాయం
చెరుకు ఒక్కసారి నాటితే 3 నుంచి ఐదు సంవత్సరాల వరకు పంట దిగుబడి వస్తుంది. మెదటి సంవత్సరం ఎకరాకు 50 నుంచి 70 టన్నుల వరకు గడలు వస్తాయని రైతులు తెలిపారు. ప్రస్తుతం టన్నుకు రూ.3100 ధర పలుకుతుండగా పెట్టుబడి రూ. 30 వేలు పోను రూ.1.30 లక్షల ఆదాయం వస్తున్నట్లు చెప్పారు. రెండు, మూడు సంవత్సరాల్లో పెట్టుబడి తక్కువగా ఉంటుందని, ఆదాయం ఎక్కువగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
పలు గ్రామాల్లో సాగు
మండలంలోని గుర్రంపోడు, ఆములూరు, కోనాయిగూడెం, కొప్పోలు గ్రామాల్లో రైతులు చెరుకు సాగు చేశారు. చెరుకు గడలు పూర్తిగా ఎదుగడంతో కూలీల సాయంతో కోతలు నిర్వహిస్తున్నారు. అయితే ఖమ్మంలో ఉన్న చక్కెర పరిశ్రమల వారు రైతుల వద్దకే వచ్చి చెరుకు గడలను కొనుగోలు చేసి లారీల్లో తరలిస్తున్నారు. మరికొందరు రైతులు తామే స్వయంగా లారీల్లో తీసుకెళ్లి ఫ్యాక్టరీల వద్ద విక్రయిస్తున్నారు. చెరుకు పంట లాభదాయకంగా ఉండడంతో మండ లంలో ఈ సారి మరింత మంది రైతులు సాగుచేసే అవకాశం ఉందని మండల వ్యవసాయ అధికారి కంచర్ల మాధవరెడ్డి తెలిపారు.