కోల్‌సిటీ, జూన్ 27: మీకేం కాదనీ.. మేమున్నామనీ..’ అంటూ స్నేహానికి గొప్ప నిర్వచనంలా స్నేహితులంతా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కొవిడ్ బారిన పడి తమతో కలిసి చదువుకున్న మిత్రుడు చనిపోయాడని తెలిసి చలించారు. గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌కు చెందిన కల్వల సతీశ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వారం కిందట కొవిడ్ బారిన పడగా, కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సతీశ్‌తో కలిసి 2002-2004లో ఎంబీఏ చదువుకున్న మిత్రులంతా విషయం తెలిసి చలించిపోయారు. అతడి కుటుంబానికి అండగా ఉండాలని నిశ్చయించుకున్నారు. తలా కొంత పోగేసి రూ.50వేలను ఆదివారం మద్దెల మహేశ్, దుర్గం హరికృష సతీశ్ స్వగ్రామం సుల్తానాబాద్ మండలం కాట్నెపల్లికి వెళ్లి అతడి భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా సతీశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. వీరిని గ్రామస్తులు అభినందించారు.
ఓదెల మండల కేంద్రంలో..
ఓదెల, జూన్ 27: బాల్య మిత్రులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఓదెల జిల్లా పరిషత్ హైస్కూల్లో 2001లో పదో తరగతి చదువుకున్న కొమిరె గ్రామానికి చెందిన అంబాల అశోక్ భార్య స్వప్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. వారికి ఇద్దరు చిన్నారులున్నారు. చిన్ననాటి మిత్రుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న స్నేహితులు రూ.50వేలను ఆదివారం అందించి స్నేహానికి ఉన్న గొప్పతనాన్ని చాటుకున్నారు. తామున్నామని స్నేహితుడికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో అల్లం సతీశ్, దాసరి కోటి, తూడి కార్తీక్, శ్రీధర్, రాజు తదితరులు పాల్గొన్నారు.