లక్ష్మీబరాజ్ వద్ద ఏర్పాటుకు సన్నాహాలు
స్థలాన్ని పరిశీలించిన జడ్పీ అధ్యక్షులు పుట్ట మధు, శ్రీహర్షిణి
మహదేవపూర్, జూన్25 : జలస్వాప్నికుడు, అపరభగీరథడు సీఎం కేసీఆర్ కాంస్య విగ్రహాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి తెలిపారు. ప్రాజెక్ట్‌కు గుండెకాయలా నిలిచిన లక్ష్మీ(మేడిగడ్డ)బరాజ్ వద్ద ఏడడుగుల కేసీఆర్ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. ఈ మేరకు శుక్రవారం వారు లక్ష్మీబరాజ్‌ను సందర్శించారు. విగ్రహ ఏర్పాటుకు స్థలం పరిశీలించారు. బరాజ్ సమీపంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ధారించారు. బీడువారిన భూములను సస్యశ్యామలం చేసి న ఘనత కేవలం సీఎం కేసీఆర్‌దేనని, అలాంటి మహనీయుడి మానస పుత్రికగా పిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలవుతున్న లక్ష్మీబరాజ్ వద్ద కేసీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తెలిపారు. ఇప్పటికే విగ్రహాన్ని తయారుచేయించి అంబట్పల్లి గ్రామంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు నివాసంలో ఉంచినట్లు చెప్పారు. అతి త్వరలోనే విగ్రహాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతి, మహదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు, యూత్ మండలాధ్యక్షుడు అలీంఖాన్, మహిళా అధ్యక్షురాలు అరుణ, ఉప సర్పంచ్ సల్మాన్, నాయకులు మనోహర్, రాకేశ్ పాల్గొన్నారు.