
రామాయంపేట, నవంబర్ 23: ప్రధానమంత్రి ఉపాధి కల్పనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కో ఆపరేటివ్ అధికారి కరుణ, ఎస్బీఐ ఏడీబీ చీఫ్ మేనేజర్ రవీంద్రనాథ్, కోనాపూర్ సొసైటీ చైర్మన్ కరికె విజయలక్ష్మి అన్నారు. మంగళవారం కోనాపూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని గ్రామంలోని పీఏసీఎస్ షాపింగ్ కాంప్లెక్సులో నిర్వహించారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే పీఎం ఉపాధి పథకం ఉద్దేశమన్నారు. గ్రామంలోని యువత వివిధ రంగాల్లో శిక్షణ పొందేందుకు జిల్లా స్థాయి ఉపాధి శిక్షణకు హాజరు కావాలన్నారు. ఏ రంగాల్లో విశిష్టత కలిగి ఉంటారో అదే రంగంలో బ్యాంకుల వారీగా రుణాలు గాని, పరిశ్రమలకు రుణాలు అందేవిధంగా పీఎం ఉపాధి పథకం పనిచేస్తుందన్నారు. రైతులు ఏదైనా చిన్న పరిశ్రమలు పెట్టుకోదలుచుకుంటే వారికి గ్రామీణ వికాస్ కింద శిక్షణ ఇచ్చి రుణాలను అందజేస్తామన్నారు. అంతేగాకుండా వైద్య రంగంలో అవగాహన ఉన్న వారికి ఆ రంగంలోనే ఉపాధి కల్పిస్తామని యశోద దవాఖాన నిర్వాహకులు డాక్టర్ శంకర్ అన్నారు. న్యాప్కిన్స్, ప్యాడ్ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు కూడా అప్నా గ్రీన్ ప్రోడక్టు పరిశ్రమలో ఉపాధి కల్పిస్తామని అప్నా ప్రోడక్టు మేనేజర్ అరుణ, ఫాతిమా తెలిపారు. సభకు హాజరైన వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ యువకులు ఏ రంగంలో ప్రతిభ కనబరిస్తే అదే రంగంలో ఉపాధి కల్పించడం కోసం రుణ సదుపాయం, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని కోనాపూర్ పీఏసీఎస్ చైర్మన్ విజయలక్ష్మి తన గ్రామంలో రైతులకు, యువతకు ఉపయోగపడేలా నిర్వహించడం మంచి పరిణామమని ప్రతినిధులు విజయలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యశోద దవాఖాన వైద్యులు శంకర్, చతుర ఎనర్జీ నిర్వాహకులు ప్రదీప్, సునీత, సర్పంచ్ చంద్రకళ, సొసైటీ డైరెక్టర్లు రాంచంద్రారెడ్డి, శ్రీనివాస్, హరికిషన్, టీఆర్ఎస్ నాయకులు విద్యాసాగర్, ఇమానియేల్ ఉన్నారు.