రామారెడ్డి, నవంబర్ 23: మండలంలోని రామారెడ్డి కాలభైరవ స్వామి ఆలయం(ఇసన్నపల్లి)లో స్వామి వారి జన్మదిన వేడుకలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా స్వామి వారిని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీరాం రవీందర్ మంగళవారం తెలిపారు.
ఉత్సవాలు ఇలా..
ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు బుధవారం గణపతి పూజతో పూజా కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తారు. పుణ్యహావాచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, రుద్రహవనం, కాళభైరవ హవనం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. 25వ తేదీన బద్ది పోచమ్మకు బోనాల సమర్పణ, 26న లక్ష దీపార్చన, 27న ధ్వజా రోహణం, స్వామివారికి మహాపూజ, మధ్యాహ్నం సిందూర పూజ, సాయంత్రం డోలారోహణం, సాయంత్రం ఎడ్ల బండ్ల ఊరేగింపు, రాత్రి భద్రకాళి పూజ, పల్లకీ సేవా కార్యక్రమాలు ఉంటాయి. 28వ తేదీ రథోత్సవం, ఉదయం దక్ష యజ్ఞం(అగ్నిగుండాలు), పూర్ణాహుతి, సంతతధారాభిషేకం కార్యక్రమాలను నిర్వహిస్తారు. దక్షయజ్ఞంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు.