రూ.215 కోట్లకుగాను రూ.100కోట్లకుపైనే జమ
రైతుల లోన్ అకౌంట్లకు డబ్బు
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 64,824 మందికి లబ్ధి
ఈ నెలాఖరుకు 50 వేలలోపు రుణాలన్నీ పూర్తి
సూర్యాపేట, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నకు ప్రతి అడుగులోనూ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పంటల సాగు కోసం తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తున్నారు. రూ.25వేల లోపు రుణాలను తొలి విడుతలోనే మాఫీ చేయగా, ప్రస్తుతం రూ.50వేలలోపు లోన్లను బ్యాంకులకు క్లియర్ చేసే ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఇప్పటికే దాదాపు 50 శాతం రుణమాఫీ పూర్తయింది. మొత్తం 64,824 మంది రైతులు రూ.215 కోట్ల రుణాలు తీసుకోగా, దాదాపు 37 వేల మందికి రూ.100 కోట్ల వరకు లోన్ అకౌంట్లలో జమయ్యాయి. రెండో విడుతకు సంబంధించి ఈ నెలాఖరు నాటికి నూరు శాతం మాఫీ కానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రైతుల రెండో విడుత రుణమాఫీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 50 శాతం రుణమాఫీ పూర్తయింది. రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న 64,824 మంది రైతులు దాదాపు రూ. 215 కోట్ల రుణాలు తీసుకోగా వారం రోజుల్లో దాదాపు 37 వేల మందికి వారికి సంబంధించి రూ.100 కోట్ల వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి.
గత ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణాన్ని విడుతల వారీగా మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ కార్యరూపం దాలుస్తున్నది. తొలి విడుతగా ఇప్పటికే రూ. 25 వేల లోపు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసింది. సూర్యాపేటలో 14,218 మందికి సంబంధించి రూ.18.55 కోట్లు మాఫీ కాగా, నల్లగొండలో 13,036 మంది రైతులకు సంబంధించి రూ.20.64 కోట్లు మాఫీ అయ్యాయి. రెండో విడుతలో రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం బ్యాంకులకు నిధులు విడుదల చేసింది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ ప్రక్రియ తొలుత రూ.26 వేల రుణాలు ఉన్న రైతుల రుణాలు ఖాతాల్లోకి డబ్బులు బదిలీ కాగా తదనంతరం ఆయా బ్యాంకులు రెండు నుంచి ఐదు వేల రూపాయలు పెంచుతూ ఇప్పటి వరకు దాదాపు 50 శాతం మంది రైతుల రుణమాఫీ పూర్తి చేశారు.
రెండో విడుతలో 64,824 మందికి లబ్ధి
రుణమాఫీ రెండో విడుతలో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో కలిపి 64, 824 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. రూ. 50వేల లోపు రుణాలు తీసుకున్న వారు సూర్యాపేట జిల్లాలో 27,658 మంది రైతులు ఉండగా వీరి ఖాతాల్లో రూ.86.96 కోట్లు, నల్లగొండలో 37,166 మంది రైతులకు రూ.128 కోట్లు జమ కానున్నాయి.
రూ. 100 కోట్లకు పైగా జమ
రెండో విడుత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైన వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాలోని యాభై శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా ఈ నెలాఖరుకు వంద శాతం పూర్తి కానుంది. ప్రారంభమైన వారం రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలోని సుమారు 37వేల మంది రైతులకు సంబంధించి రూ.100 కోట్ల పైగా డబ్బులు జమయ్యాయి. ప్రధానంగా కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో 50 నుంచి 60 శాతం రుణ మాఫీ పూర్తి కాగా ఇతర బ్యాంకుల్లో 40 నుంచి 45 శాతం పూర్తయిందని, ఈ నెలాఖరుకు ఉమ్మడి జిల్లాలో రుణ మాఫీ డబ్బులు రైతుల ఖాతాల్లో వేయడం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ నెలాఖరుకు పూర్తి
ప్రభుత్వం ప్రకటించిన మేరకు జిల్లాలో రైతుల ఖాతాల్లో ప్రతి నిత్యం కొద్దిమందికి డబ్బులు జమవుతున్నాయి. రెండో విడుత రుణమాఫీకి సరిపడా డబ్బులు ప్రభుత్వం నుంచి బ్యాంకర్లకు అందినందున రూ.50వేల లోపు రుణాలు తీసుకున్న వారిలో ఇప్పటి వరకు దాదాపు 50శాతం పూర్తి కావస్తుంది. ఈ నెలాఖరు నాటికి వంద శాతం పూర్తి కానున్నాయి.
-రామారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, సూర్యాపేట