కేసీఆర్ బాటలో మంత్రి జగదీశ్‌రెడ్డి
జగదీశ్‌రెడ్డి పాలకుడు కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం
మంత్రి రాకతో సూర్యాపేటలో త్వరితగతిన అభివృద్ధి
త్రిదండి చినజీయర్ స్వామి
సూర్యాపేటలోని వేంకటేశ్వరాలయం జీర్ణోద్ధరణకు శంకుస్థాపన
సూర్యాపేట, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ఆధ్యాత్మికం అభివృద్ధిలో ఒక భాగమేనని, తద్వారా ప్రజల్లో అభివృద్ధి చేసే వారిపై విశ్వాసం పెంపొందుతుందని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. భక్తిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, ఆయన అడుగు జాడల్లోనే మంత్రి జగదీశ్‌రెడ్డి పయనిస్తున్నాడని కొనియాడారు. కేసీఆర్ యాదాద్రి ఆలయం పునరుద్ధరణ చేపడుతుండగా మంత్రి సూర్యాపేట పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం జీర్ణోద్ధ్దరణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి చినజీయర్‌స్వామి సోమవారం సాయంత్రం ఆలయ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన సభలో స్వామి మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఆధ్యాత్మికతను భాగస్వామ్యం చేసినందునే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. జగదీశ్‌రెడ్డి మంత్రి కావడం జిల్లా ప్రజల అదృష్టంగా ఆయన అభివర్ణించారు. ఆయన రాకతో ఈ ప్రాంతం రూపురేఖలు మారాయన్నారు. మెడికల్ కళాశాల అందులో భాగమేనని, అదే స్ఫూర్తి జిల్లా మొత్తం విస్తరించాలని ఆకాంక్షించారు. సమాజాభివృద్ధిలో భగవత్ భక్తి ఆవశ్యం ఎంతైనా ఉందన్నారు. అటువంటి భక్తి ఉన్న సమాజం అభివృద్ధిలో అగ్రభాగాన ఉంటుందని పేర్కొన్నారు.
శ్రీ రామానుజులస్వామి వారి కృపతో వెయ్యేండ్ల క్రితమే అలాంటి భక్తికి బీజం పడిందన్నారు. రామానుజుల వారి స్ఫూర్తి ఇప్పటికీ ఉత్తర భారత దేశంలోని పలు రాష్ర్టాల్లో కనిపించడంతోపాటు రాష్ట్రంలోనూ కనిపిస్తుందన్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్ధ్దరణకు పూనుకోవడం అభినందనీయమన్నారు అలాంటి భారాన్ని మీద వేసుకుని ముందుకు సాగుతున్న మంత్రికి భక్తులు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఆధ్యాత్మిక శోభను విరజిమ్మే ఈ ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతం కావాలని ఆయన మంగళశాసనాలు అందించారు. ఆలయ జీర్ణోద్ధరణ శంకుస్థాపనతో వికాస తరంగిణి కార్యకర్తల బాధ్యత పెరిగిందన్నారు. యజ్ఞ యాగాదులతో పర్యావరణ పరిరక్షణ సులభతరమవుతుందన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా వంటి సమస్యలు కూడా హోమంతో మాయమవుతాయని పేర్కొన్నారు. శాస్త్రీయంగా ఇది రుజువైందన్నారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో అందరూ చనిపోతే, ఒక ఇంట్లో నలుగురు ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారని, అందుకు కారణం ఆ ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యితో పూజలు, హోమం చేయడమే అన్నారు. ఇది తాను చెప్పింది కాదని, దుర్గటన జరిగినప్పుడు ఓ ఆంగ్లపత్రికలో వచ్చిందని జీయర్‌స్వామి తెలిపారు.
ఆలయ విస్తరణ ఆవశ్యకతను గుర్తించాం : మంత్రి జగదీశ్‌రెడ్డి
మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా కేంద్రంగా మారడంతోపాటు పట్టణం విస్తరించి ఉండడంతో దేవాలయాన్ని విస్తరించాలని మూడేండ్ల క్రితమే నిర్ణయించామన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విస్తరణ, అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. ఆలయంలోకి వచ్చే భక్తులకు మరింత ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాలన్నదే సంకల్పమన్నారు. అలాంటి జీర్ణోద్ధరణ పనుల శంకుస్థాపనకు త్రిదండి చినజీయర్ స్వామి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. ఎంపీడీ లింగయ్యయాదవ్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి పాల్గొన్నారు.