పాలమూరును ఎండబెట్టిందెవరు..
ఒక్కరోజైనా రైతుల పక్షాన మాట్లాడారా?
ఏ మొహం పెట్టుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారు
కాంగ్రెస్, బీజేపీలపై రైతుబంధు సమితి, మార్క్‌ఫెడ్ కమిటీ ఫైర్
వనపర్తిటౌన్, నవంబర్ 22: ఉమ్మడి పాలమూరు ప్రజల వలసలకు కారకులు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కాదా.. అని రైతుబంధు సమితి, మార్క్‌ఫెడ్ కమిటీ నాయకులు ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని మంత్రి నిరంజన్‌రెడ్డి స్వగృహంలో సోమవారం వారు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏనాడైనా తెలంగాణ రైతాంగం పక్షాన మాట్లాడి కేంద్రానికి ఒక్క లేఖనైనా రాశారా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర రైతాంగ ప్రయోజనం కోసం కృషి చేశారా అన్నారు. గత పాలకులు రాజకీయం, మంత్రి పదవుల కోసం పనిచేయలేదా అని, ఏ మొహంతో రైతుల కల్లాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. వలసల జిల్లాను సస్యశ్యామలం చేసి సాగునీటిని అందించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే పాలమూరుకు తిరిగి వలసలు వస్తున్నారన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా పాలమూరు లేబర్ శ్రమ ఉండేదని, ఈనాడు అన్ని రాష్ర్టాల నుంచి పాలమూరుకు వలసలు వస్తున్నారన్నారు. రైతుల సంపద పెంచాలని, అన్నపూర్ణను సాధించేందుకు సీఎం కేసీఆర్ ఆశయంతో కృషి చేస్తున్నారని, రైతులపక్షాన ఢిల్లీ పెద్దలను కదిలించేలా పోరాడిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. నియోజకవర్గానికి సాగునీరు తెచ్చిన ఘనత మంత్రి నిరంజన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
బండి సంజయ్‌కు మూడు నల్ల చట్టాల గురించైనా తెలుసా అని ఎద్దేవా చేశారు. జిల్లావ్యాప్తంగా 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానూ 142కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేపట్టామని, 96 ఐకేపీ కేంద్రాలకు గానూ 78కేంద్రాలను ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసి రాజీవ్‌చౌరస్తాలో చర్చలకు రావాలని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ సవాల్ విసిరారు. అదేవిధంగా వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ రూ.76కోట్లతో కర్నెతండాకు, మోజర్లకు లిప్ట్ మంజూరు, సీఎన్ఆర్ పథకంలో భాగంగా 60 లిఫ్ట్‌లతో వనపర్తి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సాగునీరు అందించిన ఘనత మంత్రి నిరంజన్రెడ్డిదేనన్నారు. స్థాయిని మరిచి విమర్శలు చేయడం మానుకోవాలని, అవగాహనతో రైతులకు ఉపయోగపడే పలు సూచనలు, సలహాలు అందించాలన్నారు. సమావేశంలో సింగిల్‌విండో అధ్యక్షుడు వెంకట్రావు, మధుసూదన్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ డేగ మహేశ్వర్‌రెడ్డి, కోళ్ల వెంకటేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు దేవర్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.