ఆమనగల్లులో భవన నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరు
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, పాఠకులు
ఆమనగల్లు, నవంబర్ 21 : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని గ్రంథాలయాలకు మహర్దశ రానునున్నది. ఆయా మండలాల్లో ఉన్న గ్రంథాలయాలను ఆధునీకరించి పాఠకుల ఆసక్తి మేరకు వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆమనగల్లు మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి ఈ నెల 8న ఆమనగల్లు పాత గ్రంథాలయ స్థలంలో మోడల్ గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అతిత్వరలోనే మోడల్ గ్రంథాలయాన్ని పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని మంత్రి హామీనిచ్చారు. మాడ్గుల మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి పంచాయతీ పాలకవర్గం స్థలాన్ని కేటాయిస్తే రూ.74 లక్షలతో భవన నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. అందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నూతనంగా ఏర్పడిన కడ్తాల మండలంలో పాఠకుల అభిరుచి, ఆసక్తి మేరకు నూతన గ్రంథాలయ భవనం ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
శిథిలావస్థలో గ్రంథాలయ భవనాలు..
ఆమనగల్లు బ్లాక్ మండలాల్లో గ్రంథాలయాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాన కాలంలో కురిసిన వర్షాలకు పైకప్పుల నుంచి పడిన నీటితో విలువైన పుస్తకాలు తడిసిపోయాయి. అంతేకాకుండా పలు గ్రంథాలయాల్లో పాఠకుల అభిరుచి, ఆసక్తి మేరకు పుస్తకాలు అందుబాటులో లేవు. దీంతో గ్రంథాలయాలకు పాఠకులు వచ్చేందుకు ఆసక్తిచూపడం లేదు. గతంలో ఆమనగల్లు పట్టణంలోని గ్రంథాలయం ఉదయం, సాయంత్రం వేళల్లో అన్ని వర్గాల పాఠకులతో కిటకిటలాడేది. ప్రస్తుతం రోజువారీ పత్రికలు చదివేందుకు విశ్రాంత ఉద్యోగులు మాత్రమే గ్రంథాలయానికి వస్తున్నారు. ప్రస్తుతం గ్రంథాలయ భవన నిర్మాణం చేపట్టడంతో గ్రంథాలయాన్ని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న విశ్రాంతి భవనంలోకి మార్చారు. కాగా, మాడ్గుల మండల కేంద్రంలో ఉన్న గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకున్నది.
విద్యా రంగానికి పెద్దపీట..
మున్సిపాలిటీలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మోడల్ గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నది. విద్యవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని వర్గాల ప్రజల వినతులను దృష్టిలో ఉంచుకొని గ్రంథాలయాన్ని అన్ని వసతులతో నిర్మిస్తున్నారు. మోడల్ గ్రంథాలయానికి రూ.కోటి మంజూరుతో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వానికి ప్రశంసలు వస్తున్నాయి. పట్టణ విద్యార్థులతో పాటు, గ్రామీణ విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-తోట గిరియాదవ్, ఏఎంసీ వైస్ చైర్మన్, ఆమనగల్లు