
నూతనకల్, నవంబర్ 21 : వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. కోత కోసిన రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెడుతున్నారు. కానీ విక్రయించే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఏటా జరుగుతున్న తంతే. అయితే అన్నదాతలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సులువుగా పొందేందుకు వీలుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మద్దతు ధర దక్కకపోగా.. విక్రయానికి అధిక సమయం పడుతుంది.
9 వేల ఎకరాల్లో వరి సాగు…
మండలంలో 9 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎస్సారెస్పీ, వ్యవసాయ బోర్లు, వ్యవసాయ బావుల్లో పుష్కలంగా నీరుండడంతో ఈ సారి ఎక్కువ విస్తీర్ణంలో వరి వేశారు. సుమారు 2.50 లక్షల క్వింటాళ్ల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే మండలంలోని గ్రామాల్లో రైతులు కోతలు కోసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించారు.
ధాన్యం ఆరబెట్టాలి
నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుంది. 17 శాతం కంటే తక్కువగా తేమ ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించింది. ధాన్యం సంచుల్లో నింపి ట్రాక్టర్లో నేరుగా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకురావద్దు. 2, 3 రోజులు ఆరబోయాలి. తేమ శాతం ఎక్కువగా ఉంటే కోనుగోలు చేయరు. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టేందుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
పాటించాలిన జాగ్రత్తలివి..
పంట కోసిన తర్వాత సరిగా ఆరబెట్టకపోతే గింజలు రంగు మారుతాయి. అందుకే పూర్తిగా ఆరబెట్టాలి.
నేల మీద టార్పాలిన్, జనుపనార సంచులు పరిచి ధాన్యం ఆరబెట్టాలి. దాంతో అందులో ఇసుక కలువదు.
గాలి వాలును బట్టి ధాన్యాన్ని తూర్పార పట్టాలి. తద్వారా మట్టిపెళ్లలు, దుమ్మూధూళి, చెత్త తాలు సులువుగా ధాన్యం నుంచి వేరవుతాయి.
ఒక రకమైన ధాన్యంలో మరో రకం ధాన్యం కలిస్తే నాణ్యత తగ్గి ధర లభించదు.
మార్కెట్ యార్డులో రద్దీని పరిశీలించి సరుకును సమయానుకూలంగా తీసుకెళ్లాలి.
నాణ్యత నిర్ధారణలో తేడా ఉన్నా హమాలీ, తూకందారు, ఖరీదుదారు నిబంధనలకు విరుద్ధ్దంగా వసూళ్లు చేసినా, దయాభిక్ష పేరిట ధాన్యం తీసుకున్నా అధికారులకు తెలియజేయాలి.
ప్రభుత్వ సంస్థలకు ధాన్యాన్ని విక్రయించే రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకెళ్లి అధికారులకు అందించాలి.