
నిర్మాణాలకు నిధులు మంజూరు…
ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 20 లక్షలు
దండుపల్లిలో ప్రారంభమైన పనులు
మనోహరాబాద్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటితో పాటు మదిర, అనుబంధ గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో వాటి రూపురేఖలు మారిపోయాయి. పంచాయతీల భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మం జూరు చేయడంతో పట్టణాలను తలదన్నే విధంగా నేడు తండాలు, మదిర, అనుబంధ గ్రామాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి.
మనోహరాబాద్లో కొత్త పంచాయతీలు..
మనోహరాబాద్ మండలంలో గౌతోజిగూడెం, పాలాట, దండుపల్లి, చెట్లగౌరారం, వెంకటాపూర్ అగ్రహారం, కొండాపూర్ గ్రామాలు అనుబంధ గ్రామాలుగా ఉండేవి. కాగా వాటిని ప్రత్యేక పంచాయతీలుగాచేసి నిధులు మంజూరు చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు 90 శాతం పూర్తి దశకు చేరుకున్నాయి. గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లో కార్యకలాపాలు కొనసాగించారు. కొత్త పంచాయతీల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూ రు చేయాలని ఆదేశించింది. దీంతో గడా ప్రత్యేక నిధుల నుంచి కొత్త పంచాయతీలు పాలాట, దండుపల్లి, చెట్లగౌరారం, వెంకటాపూర్ అగ్రహారం, కొండాపూర్ గ్రామాలతో పాటు పాత పంచాయతీ అయిన కొనాయిపల్లి పీటీ గ్రామాలకు ఇటీవల రూ. 20 లక్షలు మంజూరు చేశారు. దీంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం స్థలాన్ని సేకరించారు. దండుపల్లిలో పనులు ప్రారంభమవ్వగా, ఆయా గ్రామాల్లో భూమి పూజ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొద్ది రోజులోనే పక్కా పంచాయతీ భవనాలు అందుబాటులోకి రానున్నాయి.