
రైతు శెల్లి నాగయ్య పేరు..ఇప్పుడు అల్లం నాగయ్య అయ్యిండు
40 ఏండ్లుగా అల్లం సాగు
ఆరుతడి పంటలకు అడ్రస్‌గా నిలిచిన అన్నదాత
వర్గల్, నవంబర్ 21: వ్యవసాయం ఆ రైతు కుటుంబానికి ఆదెరువు. కాలం కలిసొచ్చినా, కరువొచ్చినా అల్లం సాగునే నమ్ముకున్న కర్షకుడు. తనకున్న కొద్దిపాటి వ్యవసాయ పొలంలో ఇతర పంటలతోపాటు అల్లాన్ని కూడా సాగుచేసేవాడు. వరి ప్రధానం కాదని ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆదాయాన్ని ఇస్తాయనడానికి ఈ రైతే మార్గదర్శకుడవుతున్నాడు. అందుకే అసలు పేరు శెల్లి నాగయ్య కానీ, పేరుకు అల్లం బ్యారం నాగయ్య అని చుట్టు పక్కల గ్రామాలవారు ముద్దుగా పిలుచుకుంటారు. 40 ఏండ్లుగా అల్లం సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శెల్లి నాగయ్య పండిస్తున్న అల్లంసాగుపై కథనం..
వర్గల్ మండలం జెబ్బాపూర్కు చెందిన శెల్లి నాగయ్య మరోవిధంగా చెప్పాలంటే అల్లం బ్యారం నాగయ్య. ఈ పేరు ఆయనకు ఎందుకొచ్చిందంటే తన దగ్గర అల్లం లేకపోయినా అం గట్‌లో తెచ్చిమరీ బ్యారం చేస్తాడని గ్రామస్తులు చెబుతుంటారు. నాగయ్యకు మొత్తం 6 ఎకరాల పొలం ఉండగా, సాంప్రదాయ పంటలతోపాటు ఇతర పంటలను కూడా సాగు చేస్తున్నాడు. ఎన్ని పంటలు వేసినా అచ్చొచ్చిన అల్లం మాత్రం మరువడు. అంగట్లో అల్లానికి డిమాండ్ ఉన్నాలేకున్నా ఆ పంటను సాగు చేస్తుంటాడు. ఎందుకలా..? అని ఎవరైనా ప్రశ్నవేస్తే అల్లం బ్యారమే తనను ఆదుకుందని చెబుతుంటాడు.
రూ.30 వేల పెట్టుబడికి లక్ష లాభం..
ఒక ఎకర అల్లం సాగుకు పెట్టుబడి రూ.30 వేలు వరకు వస్తుంది. మూడు ట్రాక్టర్ల కోడెరువు, 2 యూరియా బ్యాగులు, మూడుసార్లు కలుపుకూళ్లు, ఇతర ఖర్చులతో మొత్తం రూ.30 వేల పెట్టుబడి దాటదని, పంటకు లక్ష రూపాయల లాభం వస్తుందని రైతు నాగయ్య తెలిపాడు.
40 ఏండ్ల నుంచి అల్లం సాగు చేస్తున్న..
నా వయసు 72 ఏండ్లు. నా చిన్నతనం నుంచి ఎవుసమే చేస్తున్న. పిల్లల కార్యా లు అయినయి. పొద్దుగాల్ల లేచి బాయికాడికి పోందే పొద్దుగడవదు. ఎన్ని పంటలేసినా అల్లం పండియందే మనసుకెక్కది. నాకు బువ్వబెట్టిన బ్యారం అల్లమే. అందుకే అల్లంసాగుచేస్తా. 40 ఏండ్ల సంది సాగు చేస్తున్న. అంగట్లో అమ్ముతా, అయిపోతే చేన్లు గుత్తకు తీసుకొని బ్యారం చేస్త. అల్లాన్ని మాత్రం మరువను.