
విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
కలెక్టర్ వెంకట్రావు
నవాబ్‌పేట కేజీబీవీ తనిఖీ
నవాబ్‌పేట, నవంబర్ 21 : విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు బాగా చెబుతున్నారా అని ఆరా తీయగా, ఇద్దరు టీచర్లు బాగా చెబుతారని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలన్నారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థినులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. అలాగే క్రీడలు, యోగాలాంటి వాటిలో విద్యార్థినులకు తర్ఫీదు ఇప్పించాలని తెలిపారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపాల్ మాధవికి సూచించారు. గతంలో పాఠశాల నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. విద్యార్థినులకోసం తయారు చేసిన భోజనాన్ని చూశారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సూచించారు. వంట మనుషులు తక్కువగా ఉన్నారని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, త్వరలోనే ఏర్పాటు చేయిస్తానని పేర్కొన్నారు.
వైష్టవి బాగోగులు చూసుకుంటా..
పుట్టిన అనతి కాలంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఆరోతరగతి విద్యార్థిని వైష్టవి బాగోగులు తానే చూసుకుంటానని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. ఆదివారంఆరోతరగతి విద్యార్థిని వైష్టవిని కలిసేందుకు ఆమె అవ్వ కేజీబీవీకి వచ్చింది. వృద్ధురాలిని కలెక్టర్ పలుకరించగా.. ఏడుస్తూ చిన్నారి వైష్ణవి దీనగాథను కలెక్టర్‌కు వివరించింది. సార్ మాది కూచూర్ గ్రామం. వైష్టవి పుట్టిన మూడు నెలలకే తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. కొన్నాండ్లకు తండ్రి కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. మూడు నెలల పాపను నేనే సాకుతున్నా అంటూ కన్నీటి ప ర్యంతమైంది. దీంతో కలెక్టర్ చలించిపోయారు. వైష్ణవి ఇప్ప టి నుంచి అనాథ కాదని.. ఆమె బాగోగులు తానే చూసుకుంటానని కలెక్టర్ వెంకట్రావు ప్రకటించారు.