ఇబ్రహీంపట్నం మండలంలో ఆదర్శంగా నిలుస్తున్న కప్పాడు గ్రామం
రెండున్నరేండ్లలో గ్రామానికి రూ.కోటి ఖర్చు
ఆహ్లాదకర వాతావరణంలో పల్లె ప్రకృతివనం
వైకుంఠధామం, డంపింగ్ యార్డు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధి దీపాలు,ఇంటింటికీ నల్లాలు
గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పాలకవర్గం
ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 20 : గత పాలకుల హయాంలో కప్పాడు గ్రామంలో ఎటుచూసినా రోడ్లపై మురుగు, పెంటకుప్పలు, వీధులన్నీ కంపు కంపుగా ఉండి, ప్రతినిత్యం ఈగలు, దోమలతో ప్రజలు నిత్యం రోగాలతో అవస్థలు పడుతుండేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రవేశపెట్టిన పల్లె ప్రగతితో గ్రామం అభివృద్ధిలో ఉరకలు వేస్తున్నది. కప్పాడు గ్రామం అతి తక్కువ సమయంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. రెండున్నరేండ్ల కాలంలో గ్రామానికి ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రూ.కోటి వరకు నిధులు కేటాయించారు. గ్రామంలో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికి తాగునీటి నల్లాలు, వీధి దీపాలు, వందశాతం మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ప్రతిరోజూ ఇంటింటికీ చెత్తసేకరణ చేపట్టి కంపోస్టుయార్డుకు తరలించడం, హరితహారం మొక్కలకు నీటిని అందజేయడం వంటి పనులు సక్రమంగా చేపడుతున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సహకారంతో గ్రామానికి పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్నారు.
నియోజకవర్గంలో ఎక్కడా లేనివిధంగా కప్పాడు పల్లె ప్రకృతివనాన్ని తీర్చిదిద్దారు. పల్లె ప్రకృతి వనానికి చుట్టూ నీరు, మధ్యలో పెద్ద కొండ, చుట్టూ వాకింగా ట్రాక్ ఏర్పాటు చేశారు. వనంలో అటవీ జంతువులు, పక్షుల బొమ్మలు, పచ్చని చెట్లు దర్శనమిస్తుంటాయి. దీంతో ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఇచ్చట గడపడానికి ఆసక్తి చూపుతున్నారు. సర్పంచ్ హంసమ్మ గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.
వైకుంఠధామానికి రూ.12.06లక్షలు, వర్మీకంపోస్టు యార్డుకు 2లక్షలు, ట్రాక్టర్కు 7.04లక్షలు, పల్లె ప్రకృతివనానికి 6.40లక్షలు ఖర్చు చేశారు. వీటితోపాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులైన్లు, వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలు, హరితహారం మొక్కల పెంపకంతోపాటు వివిధ రకాల పనుల కోసం ప్రభుత్వం నుంచి ఈ రెండున్నరేండ్లలో సుమారు రూ.కోటి వరకు కేటాయించి గ్రామాన్ని అభివృద్ధితోపాటు స్వచ్ఛతలో ముందుకు తీసుకెళ్తున్నారు.