
మెదక్ జిల్లాలో 49 దుకాణాలకు లక్కీడ్రా
లక్కీ డ్రా తీసిన హనుమకొండ కలెక్టర్ హరిత
సిద్దిపేటలో 93 దుకాణాలకు 91 డ్రా
2 వైన్స్‌లకు డ్రా వాయిదా
పలువురు మహిళలకు దక్కిన అదృష్టం
డ్రాను ప్రారంభించిన పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్
సంగారెడ్డిలో 101 వైన్‌షాపులకు డ్రా తీసిన కలెక్టర్ హనుమంతరావు
పలుచోట్ల సిండికేట్లు, బినామీల జోరు
మెదక్/సిద్దిపేట టౌన్/సంగారెడ్డి నవంబర్ 20 : ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియ శనివారం ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల డిమాండ్ ఉన్న వైన్స్‌ల కోసం పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డ్రా ప్రక్రియకు ఆశావహులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మెదక్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ప్రత్యేకాధికారి, హనుమకొండ కలెక్టర్ హరిత ఆధ్వర్యంలో లక్కీ డ్రా ప్రారంభించారు. జిల్లాలోని 49 దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా విజేతలను ప్రకటించారు. సిద్దిపేటలో 93 దుకాణాలకు టెండర్లు పిలువగా, 91 మందిని అదృష్టం వరించింది. రెండు షాపుల డ్రాను ఎక్సైజ్ శాఖ వాయిదా వేసింది. విపంచి కళానిలయంలో పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీసి టోకెన్ వేసి విజేతలను ఎంపిక చేశారు. సంగారెడ్డిలో 101 దుకాణాల కోసం పోతిరెడ్డిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. కాగా, మద్యం షాపులు దక్కించుకున్న వారు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించనున్నారు.
సిండికేట్లు, బినామీలదే జోరు..
కొంత మంది వ్యాపారులు ఒక్కొక్కరు ఐదు నుంచి పది వరకు దరఖాస్తులు వేసినట్టు తెలుస్తోంది. బినామీ పేర్లపై టెండర్ వేసి దుకాణం పొందన వారు ఉన్నారు. మరి కొందరు ముందే సిండికేట్‌గా ఏర్పడి పది మంది కలిసి ఒకే దుకాణానికి దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, టెండర్లు దక్కించుకున్న వారిలో పలువురు కొత్తవారు ఉండగా, వారికి గుడ్‌విల్ ఇచ్చి షాపును తీసుకున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. గుడ్‌విల్‌కు ఒప్పుకోకపోతే గుడ్‌విల్‌కు మద్యం దుకాణాల్లో పార్ట్నర్షిప్ అయినా ఇవ్వండి అని ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లోని మద్యం దుకాణాలు ఎక్కువగా సిండికేట్ వ్యాపారులకు దక్కినట్లు తెలుస్తోంది.
మహిళలను వరించిన అదృష్టం
మారుతున్న కాలంతో పాటు మగవారితో సమానంగా మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. వారి పేరు మీద ఏ పనిచేసినా విజయవంతమవుతామనే నమ్మకం కొందరిని విజేతలుగా నిలబెట్టింది. సిద్దిపేటలో 292 మంది మహిళలు మద్యం దుకాణాల కోసం టెండర్లు వేయగా, అందులో 15 మందిని అదృష్టం వరించింది. అలాగే, హుస్నాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని పాలమాకులకు 51, తీగుల్ నర్సాపూర్‌కు 38 అత్యధికంగా టెండర్లు వస్తే అందులో ప్రధానంగా పాలమాకుల వైన్స్‌కు తీవ్ర పోటీ నెలకొంది. లక్కీడ్రాలో పాలమాకుల వైన్స్ పాతూరి అశోక్‌రెడ్డికి వరించింది. తీగుల్ నర్సాపూర్ వైన్స్ స్వామిగౌడ్‌కు దక్కింది. సంగారెడ్డిలో 290 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 13 మంది దుకాణాలను దక్కించుకున్నారు.
సంగారెడ్డి జిల్లా..
పోతిరెడ్డిపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో 101 మద్యం దుకాణాల కోసం లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ప్రకటించారు. మొత్తం 2310 దరఖాస్తులు వస్తే అమీన్పూర్ దుకాణానికి అత్యధికంగా 53 దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 11గంటలకు ప్రారంభమైన లక్కీడ్రా మధ్యా హ్నం 4.30 గంటలకు ముగిసింది. రిజర్వేషన్ పద్ధతిలో ఎస్సీలకు 13, ఎస్టీలకు 2, గౌడ్స్‌కు 7, ఓపెన్ కేటగిరీలో 79 దుకాణాలను కేటాయించారు.
సిద్దిపేటలో 91 మందిని వరించిన లక్కు
జిల్లాలో 93 మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభు త్వం టెండరుల పిలిచింది. లైసెన్స్ కోసం 1702 మం ది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. గెజిట్ ఆధారంగా లక్కీ డ్రా తీయగా, 91 మందిని లక్కు వరించింది. 30 మంది కలిసి 50 టెండర్లు వేయగా, అం దులో 5 వైన్స్‌లను దక్కించుకున్నారు. అయితే, దొమ్మ ట, కొత్తూరు దుకాణాలకు అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో డ్రాను ఎక్సైజ్ శాఖ వారం రోజుల పాటు వాయిదా వేసింది.