జిల్లా సంక్షేమశాఖ అధికారి ముసాయిదాబేగం
గద్వాల,నవంబర్ 20: విద్యార్థులు ప్రాథమిక దశనుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి ముసాయిదాబేగం సూచించారు.అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముసాయిదా బేగం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలల హక్కులకు విఘాతం కలగకుండా అధికారులు అందుబాటు లో ఉంటారని చెప్పారు. బాలల హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలలను ఎవరూ పనిలో పెట్టుకోవద్దని సూచించారు.బాలల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పాటు పడుతుందన్నారు. అత్యవసర పరిస్థితిలో 100,1098 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగేటట్లు చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కార్మికశాఖ అధికారి మహేశ్‌కుమార్, సీడబ్ల్యూసీ చైర్మన్ సహదేవుడు, ఇతర అధికారులు శైలజ, నర్సింహ, సుజాత, కమలాదేవి, భాస్కర్, రవి, ప్రకాశ్, సురేశ్, నవీన్, రమణ జమ్మన్న, లక్ష్మీదేవి, భీమేశ్ ఎన్జీవో గిరిబాబు పాల్గొన్నారు.