
నేడు మద్యం దుకాణాలకు డ్రా
దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
ఉమ్మడి జిల్లాలో 230 షాపులు
4,713 దరఖాస్తులు
వనపర్తి నవంబర్ 19 (నమస్తే తెలంగాణ)/గద్వాల న్యూటౌన్ :మద్యం దుకాణాలకు శనివారం లక్కీ డ్రా తీయనున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగిన టెండర్ల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 230 దుకాణాలకుగానూ 4,713 దరఖాస్తులు వచ్చాయి. దుకాణానికి ఒకరి చొప్పున మొత్తం 230 మందిని లక్కీ డ్రా వరించనున్నది. వైన్స్ దుకాణాలను చేజిక్కించుకున్నవారు 2021-23 వరకు రెండేండ్ల పాటు నిర్వహణకు అవకాశం ఉంటుంది.
మద్యం దుకాణాలను శనివారం డ్రా పద్ధతిన కేటాయించనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొన్నది. అదృష్ట దేవత ఎవరిని వరిస్తుందోనని చర్చించుకుంటున్నారు. లక్కు లేకుంటే రూ.2లక్షలు గోవిందా అయినట్లే. ఇక కొందరైతే తమ ఇష్ట దేవుళ్లకు తమకు దుకాణం దక్కితే పండుగలు చేస్తామంటూ ముడుపులు కట్టారు. మరికొందరు తాము దరఖాస్తు వేసిన వైన్‌షాప్ ఎవరికి దక్కినా తమకు కొంత వాటా ఇవ్వాలని, తమకు వస్తే తాము వాటా ఇస్తామంటూ ముందస్తుగా చర్చింకొని ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. లాటరీలో దుకాణాలు వస్తే తమ తలరాత మారుతుందని ఆశ పడుతున్నారు. జనరల్ దరఖాస్తుకు అన్నివర్గాలు దరఖాస్తు చేసుకోగా, గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన దుకాణాలకు మాత్రం సంబంధిత సామాజిక వర్గాల వ్యక్తులే దరఖాస్తు చేసుకున్నారు. వారికి రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయించనున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 230 దుకాణాలు ఉండగా, 4,713 దరఖాస్తులు వచ్చాయి. వనపర్తి జిల్లాలో 37 మద్యం దుకాణాలకుగానూ 694 దరఖాస్తులు సమర్పించారు. ఇందులో వనపర్తి పట్టణానికి సంబంధించి 365, కొత్తకోటలో 247, ఆత్మకూర్‌లో మద్యం దుకాణాలకు సంబంధించి 82 దరఖాస్తులు సమర్పించారు. శనివారం మద్యం దుకాణాలను డ్రా పద్ధతిన దరఖాస్తుదారులకు కేటాయించనున్నారు.
గద్వాలలో 987దరఖాస్తులు
జోగుళాంబ గద్వాల జిల్లాలో 36 మద్యం దుకాణాలు ఉండగా, 987 దరఖాస్తులు వచ్చాయి. గద్వాల పట్టణ శివారులోని జమ్మిచెడులోగల హరిత హోటల్లో వైన్‌షాపుల కేటాయింపునకు డ్రా తీయనున్నారు. ఇందుకు జిల్లా ఇన్చార్జి ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి సమక్షంలో డ్రా నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు ఆయా దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వారికి కేటాయించిన నెంబర్ల ఆధారంగా లాటరీ నిర్వహిస్తారు. డ్రాలో ఎవరి అదృష్టం వరిస్తుందో వారే మద్యం దుకాణం నడపాల్సి ఉంటుంది. లాటరీలో దుకాణం వ్యక్తులు నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 1నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులోకి రానుంది.
చక్రం తిప్పిన వ్యాపారులు
జోగుళాంబ గద్వాల జిల్లా రెండు రాష్ర్టాలకు సరిహద్దుగా ఉంది. అలంపూర్ సెగ్మెంట్ సరిహద్దులోని మద్యం దుకాణాలను ఎలాగైనా దక్కించుకోవాలని ఏపీకి చెందిన వ్యాపారులు, రాజకీయ నాయకులు అలంపూర్‌కు చెందిన ఓ నాయకుడితో సిండికెట్‌గా మారి ఒక్కో దుకాణానికి 15కుపైగా టెండర్లు వేశారు. గతంలోనూ సదరు వ్యక్తియే తన అనుచరులతో మద్యం టెండర్లలో 6 దుకాణాలను తన వర్గీయులు దక్కించుకోవడంలో ప్రధాన భూమిక పోషించాడు. ఇక అలంపూర్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు అతి చేరువలో ఉండడంతో కర్నూల్, నంద్యాల, నందికొట్కూర్, అనంతపురం, కడప తదితర ప్రాంతాలకు చెందిన వారు సైతం టెండర్లలో తమ అదృష్టం పరీక్షించేందుకు టెండర్లలో పాల్గొన్నారు. ఏపీకి సరిహద్దు కావడంతో ఇక్కడి వ్యాపారులతో అక్కడి వ్యాపారులు సిండికెట్‌గా మారి పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. అలాగే గౌడ, ఎస్సీ వర్గాలకు చెందిన వారిని కొందరు వ్యాపారులు తమవైపు తిప్పుకొని టెండర్లు వేయించినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలకు మొత్తం 987 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.19.74కోట్ల ఆదాయం సమకూరింది.
దరఖాస్తులు ఇలా..
గద్వాల జిల్లాలో మొత్తం 36దుకాణాలకు టెండర్లు వేశారు. ఇందులో జిల్లావ్యాప్తంగా ఎస్సీలకు 6, గౌడ్ కులస్తులకు 5షాపులను కేటాయించారు. వీటి నిర్వహణకు 9నుంచి 18వరకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 987దరఖాస్తులు వచ్చాయి. అందులో గద్వాల మున్సిపాలిటీ పరిధిలో 8 దుకాణాలకుగానూ 123, అయిజ మున్సిపాలిటీలో 6 దుకాణాలకు 79, మల్దకల్లో 2దుకాణాలకు 22, ధరూరులో 2దుకాణాలకు 18, గట్టులో 2దుకాణాలకు 22, కేటీదొడ్డిలో ఒక దుకాణానికి 14 దరఖాస్తులు వచ్చాయి. దీంతో గద్వాల సెగ్మెంట్లోని 21దుకాణాలకు 279 దరఖాస్తులు రాగా, అలంపూర్ మున్సిపాలిటీలో 2 దుకాణాలకు 84, వడ్డేపల్లిలో 2 దుకాణాలకు 69, రాజోళిలో 2 దుకాణాలకు 72, ఉండవెల్లి పుల్లూరు వద్ద 4 దుకాణాలకు 345, మానపాడులో 2దుకాణాలకు 22, ఇటిక్యాలలో 3 దుకాణాలకు 115 దరఖాస్తులు వచ్చాయి. దీంతో అలంపూర్ సెగ్మెంట్లో మొత్తం 709 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా ఉండవెల్లి మండలం పూల్లురు స్టేజ్ వద్ద 4దుకాణాలు ఏర్పాటు చేయగా.. అందులో ఒక దుకాణాన్ని గౌడ కులస్తులకు రిజర్వ్ చేశారు. దీనికి 57 దరఖాస్తులు వచ్చాయి. ఇక షాపు నం.29కి 96, 30కి 93, 31కి 97దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా ధరూరు, గట్టు మండలాల్లోని మద్యం దుకాణాలకు ఒక్కో దుకాణానికి 9 దరఖాస్తులు రాగా, బల్గెరలోని మద్యం దుకాణానికి మాత్రం 13 దరఖాస్తులు వచ్చాయి.
ఏర్పాట్లు పూర్తి
వనపర్తి జిల్లాలో మద్యం దుకాణాలను డ్రా పద్ధతిన కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు జిల్లా కేంద్రంలోనే డ్రా తీసి కేటాయిస్తాం. వనపర్తి జిల్లాకు సంబంధించి మొత్తం 694 దరఖాస్తులు వచ్చాయి.