కామారెడ్డి టౌన్, నవంబర్ 19: బాలికలు ఆపద వచ్చినప్పుడు 1098 నంబర్‌కు ఫోన్ చేయాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారిణి సరస్వతి అన్నారు. జాతీయ బాలల స్నేహపూరిత వారోత్సవాల్లో భాగంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ, రోజ్ చైల్డ్ లైన్-1098 ఆధ్వర్యంలో కస్తూర్బా బాలికల పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారిణి మాట్లాడుతూ.. చిన్నారులు ఇంట్లో వారికి చెప్పుకోలేని విషయాలను కూడా 1098కి ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. వారు స్పందించి తగిన సలహాలు, సూచనలు ఇస్తారని తెలిపారు. బాలికలు చట్టాలు, బాల్య వివాహాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. చిన్నారులు లక్ష్యం పెట్టుకొని అందుకు అనుగుణంగా ఇష్టపడి చదివి విజయం సాధించాలన్నారు. సమాజం కోసం సేవ చేసే సైనికులుగా ఎదగాలని సూచించారు. బాలల సంరక్షణ కమిటీ సభ్యురాలు స్వర్ణలత మాట్లాడుతూ.. సమాజంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. సీడీపీవో రోచిష్మా మాట్లాడుతూ.. మంచి సమాజ నిర్మాణంలో మహిళలు మొదటి వరుసలో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా చైల్డ్‌లైన్ 1098కు ఫోన్ చేస్తే ఎవరికి కాల్ వెళ్తుంది..? ఎంతమంది అధికారులు పనిచేస్తారనే విషయాలను నాటిక ద్వారా వివరించారు. అనంతరం చైల్డ్ లైన్ సే దోస్తీ చైల్డ్ లైన్ -1098 గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో చైల్డ్ లైన్-1098 జిల్లా ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ అమృత రాజేందర్, సిబ్బంది రవి, అరుణ, కిశోర్, సఖి సెంటర్ సిబ్బంది కవిత, కేజీబీవీ సిబ్బంది రెబిక, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.