
భువనగిరి అర్బన్, డిసెంబర్ 17 : దివ్యాంగుల సంక్షేమంలో యాదాద్రి జిల్లా ముందంజలో ఉందని, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, డి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భువనగిరిలోని వైఎస్ఆర్ గార్డెన్లో శుక్రవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమంలో జిల్లా ముందంజలో ఉందని, అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. దివ్యాంగుల సమస్యలకు సంబంధిత శాఖలు సకాలంలో పరిష్కారం చూపిస్తున్నాయని తెలిపారు. దివ్యాంగుల సహాయ, సహకారాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-572-8980 అందుబాటులో ఉందని, దీనికి ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా దివ్యాంగులు నృత్య ప్రదర్శనలో ప్రతిభ కనబర్చిన వారికి మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, అడిషనల్ పీడీ నాగిరెడ్డి, 6వ స్టాడింగ్ కమిటీ ప్రెసిడెంట్ అనూరాధ, జిల్లా కో-ఆర్డినేటర్ జోసెఫ్, భువనగిరి రూరల్ ఎస్ఐ కె.సైదులు, సూపరింటెండెంట్ శశికళ, ఎఫ్ఆర్ఓ తిరుపతిరెడ్డి, డీసీపీఓ సైదులు, దివ్యాంగుల సంక్షేమం సంఘం అధ్యక్షులు, దివ్యాంగులు పాల్గొన్నారు.