
కేతేపల్లి, డిసెంబర్ 17 : యాసంగి పంట సాగుకు మూసీ కుడి, ఎడమ కాల్వలకు శనివారం నుంచి నీటి విడుదల చేయనున్నారు. నాలుగు విడుతల్లో ఆన్ అండ్ ఆఫ్ విధానంలో నీటి విడుదలకు అధికారులు ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో ఆగస్టులోనే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దాంతో ఆయకట్టులో వానకాలం సాగు సైతం ప్రభుత్వం నీటిని విడుదల చేసింది.
వరి వద్దంటున్న అధికారులు.
యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో ప్రాజెక్టు నీటి విడుదలకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వరి ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంలో ఆయకట్టులో రైతులు కొంత అయోమయంలో ఉన్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలో కుడి, ఎడమ కాల్వల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో రైతులు వరిపంట వేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయకట్టు రైతులు చాలామంది ఇప్పటికే నారుమళ్లను సిద్ధ్దం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అధికారులు మాత్రం ఆరుతడి పంటలకు మాత్రమే నీటి విడుదల చేస్తున్నామని తెలిపారు. రైతులు వరి సాగు ప్రయత్నం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టంతో తొణికిసలాడుతున్నది. శనివారం రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి కాల్వలకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.