మానేరువాగులో విద్యార్థుల మృతికి అమాత్యుడి సంతాపం
బాలుర ఇండ్లకు వెళ్లి తల్లిదండ్రులకు పరామర్శ
ఒక్కో కుటుంబానికి 5లక్షల చొప్పున ఆర్థిక సాయం
రోదనలు చూసి చలించిపోయిన రామన్న
పిల్లల మృతి హృదయవిదారకమంటూ ఆవేదన
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆదేశం
సిరిసిల్ల/సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్, నవంబర్ 17: కొడుకులను కోల్పోయిన ఆ కన్నపేగులకు అమాత్యుడు రామన్న ఓదార్పునిచ్చారు. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన తల్లిదండ్రులకు ‘నేనున్నా’అంటూ భరోసానిచ్చారు. సిరిసిల్ల మానేరువాగులో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం బాధితుల ఇండ్లకు వెళ్లి పరామర్శించారు. చిన్నారుల మృతిపై విచారం వ్యక్తం చేసి, ‘అధైర్య పడొద్దు. మీకు అండగా ఉంట’ అని అభయమిచ్చారు. కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరును చూసి చలించిపోయారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఆరుగురు పిల్లలు చనిపోవడం హృదయవిదారకమని, ఈ ఘటన తనను ఎంతగానో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావొద్దని, మానేరు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు గస్తీ పెట్టాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
మానేరు వాగులో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా, బాధిత కుటుంబాలకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పిల్లల ఆత్మకు శాంతికలగాలని, మృతుల కుటుంబాలకు తనవంతుగా ఆత్మైస్థెర్యం కల్పించారు. బుధవారం చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా సిరిసిల్లకు సాయంత్రం 5:10గంటలకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను ఇంటింటికీ వెళ్లి పరామర్శించి ఓదార్చి 6:15 గంటలకు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం 6:45గంటలకు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు. మంత్రి వెంట నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, తహసీల్దార్ విజయ్, కౌన్సిలర్లు ఒగ్గు ఉమ, బుర్ర లక్ష్మీ, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, దడిగెల శ్రావణ్‌రావు, బుర్ర మల్లికార్జున్, లింగంపల్లి సత్యనారాయణ, బండారి శ్యాం, గొల్లపల్లి బాలయ్యగౌడ్, ఒగ్గు రాజేశం, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్, టీఆర్ఎస్వై, టీఆర్ఎస్వీ నాయకులు ఉన్నారు.
‘సిరిసిల్ల విద్యార్థుల మృతి ఘటన తనను ఎంతో కలిచివేసిందని, ఇలాంటి హృదయవిదారకర ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. బుధవారం మృతుల కుటుంబాల పరామర్శ అనంతరం సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్లలోని రాజీవ్‌నగర్‌లో ఒకే కాలనీకి చెందిన విద్యార్థుల మృతి సిరిసిల్లను కన్నీటిపర్యంతం చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేసినట్లు వివరించారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు సామాజిక బాధ్యత అవసరమని, జాగ్రత్తలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. పిల్లలు తల్లిదండ్రుల మాటలను గ్రహించాలని సూచించారు. నాప్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఆర్ఎస్ నాయకులు చేసిన సహాయక చర్యలను కొనియాడారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు..
మానేరు తీరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వివరించారు. వాగులో హెచ్చరిక బోర్డులు, పోలీసు గస్తీ ఉండేలా ప్రణాళికలు తయారుచేస్తున్నామని చెప్పారు. ఈ విషయమై కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్‌పర్సన్‌కు సూచనలు అందించినట్లు వివరించారు. చెక్ డ్యాం తెగిన చోట పటిష్టమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళకు ఆదేశించారు. సిరిసిల్ల మానేరు వాగులో ఇప్పటివరకు ఇన్ని నీళ్లు ఎన్నడూ రాలేదని, చూసేందుకు ప్రజలంతా తరలివస్తున్నారని చెప్పారు. వాగులోకి వెళ్లవద్దని తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, తదితరులు ఉన్నారు.శ్రీరాం క్రాంతి నివాసానికి వెళ్లారు. కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొడుకును కోల్పోయామని మంత్రి ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించారు. చలించిన మంత్రి వారిని ఓదార్చారు. వర్క్ టూ ఓనర్ పథకంలో నాలుగు మరమగ్గాలు క్రాంతి తండ్రి రమేశ్‌కు ఇవ్వాలని పీఎస్ శ్రీనివాస్‌కు సూచించారు.
నేరుగా విద్యార్థుల ఇంటికి..
సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ఒకే కాలనీకి చెందిన ఆరుగురు విద్యార్థులు మృతిచెందగా బుధవారం మంత్రి కేటీఆర్ ఇంటింటికీ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.ముందుగా జడల వెంకటసాయి నివాసానికి వెళ్లి తల్లిదండ్రులు అనిల్-స్వప్నను ఓదార్చారు. ఘటన జరిగిన తీరు, కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం ద్వారా 5లక్షల ఆర్థికసాయానికి సంబంధించిన చెక్కును అందించారు.
కొలిపాక గణేశ్ కుటుంబం స్థానికంగా లేకపోవడంతో పరామర్శించ లేకపోయారు. బాధిత కుటుంబానికి అందించాల్సిన రూ.5లక్షల చెక్కును మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళకు ఇచ్చారు. వారు స్వగ్రామానికి చేరుకోగానే నివాసానికి వెళ్లి చెక్కును అందజేయాలని సూచించారు. సమస్యలు ఉంటే తెలుసుకొని తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
తీగల అజయ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. 5లక్షల చెక్కును అందజేశారు. ఇటీవల ప్రమాదంలో గాయపడిన అజయ్ తండ్రి ఎల్లయ్య తనకు మున్సిపల్లో ఉద్యోగం కల్పించాలని కోరగా, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. తల్లి దేవేంద్రను అధైర్యపడొద్దు అండగా ఉంటానని భరోసానిచ్చారు.