రైతు బడి..వ్యవసాయ విజ్ఞాన గుడి..
కొల్లాపూర్ డివిజన్లో 28రైతు వేదికలు
రూ.6.16 కోట్లతో నిర్మాణాలు
సమావేశాలకు దోహదం కానున్న భవనాలు
కొల్లాపూర్ రూరల్, నవంబర్ 15 : కాలానుగుణంగా రైతుల ఆలోచన విధానంలో మార్పు తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పంట ఎంపిక, సాగు విషయంలో అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు ఇందుకు అడ్డాగా మారనున్నాయి. అన్నదాతలను ఒకే చోటుకు చేర్చి వ్యవసాయ ఉత్పత్తులు, రకాలు, దిగుబడి, విధానం, ఎరువులు చల్లడం, సేద్యం చేసేవిధానంలో ఆధునికతవైపునకు మళ్లించేందుకు దోహదపడనున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన రైతులను సీఎం కేసీఆర్ దశలవారీగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నిర్మిస్తున్న రైతువేదికలు వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దబడుతున్నాయి. కొల్లాపూర్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాలకు 28 రైతువేదికలు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ.22 లక్షల చొ ప్పున ప్రభుత్వం రూ.6.16 కోట్లు ఖర్చు చేసిం ది. ఈ వేదికల్లో వ్యవసాయాధికారులు రైతులతో సమావేశమై ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పూ ర్తి అవగాహన కల్పిస్తున్నారు. కొల్లాపూర్ మండలంలో 9, పెంట్లవెల్లిలో 3, కోడేరులో 7, పెద్దకొత్తపల్లిలో 9 భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. రెండు, మూడు గ్రామాలను కలిపి క్లస్టర్‌గా ఏర్పా టు చేసింది. క్లస్టర్‌కు ఒక ఏఈవోలను నియమించింది. ఏఈవో తనకు నిర్ధేశించిన పరిధిలో రైతులకు సలహాలు, సూచనలివ్వడంతోపాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను వివరిస్తున్నారు. ప్ర తి క్లస్టర్లో రైతుబంధు కో-ఆర్డినేటర్‌తోపాటు 14 మంది సభ్యులులతో కమిటీని ఏర్పాటు చే సింది. కమిటీ, ఏఈవోలు సమన్వయంతో పని చేసి దిగుబడి సాధించేలా కృషి చేస్తున్నారు.
ఆధునికత వైపు అడుగులు..
స్వరాష్ట్రంలో రైతులకు సాగునీటి గోస తీరింది. ఏడాదికి రెండు పంటలకు సరిపడా నీరందుతుండడంతో సంతోషంగా సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులందరూ ఒక చోట చేరి చర్చించుకునేందుకు వేదిక అవసరమని భావించిన తెలంగాణ సర్కార్.. రైతు వేదికల పేరుతో సర్వాంగసుందరంగా అన్ని హంగులతో భవనాలను నిర్మించింది. ఈ భవనాల్లో వ్యవసాయాధికారులు రైతులతో సమావేశమై పంటలపై అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొల్లాపూర్ రైతులు వలస వెళ్లేవారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించింది. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ప్రతి గ్రామంలో విస్తరణాధికారుల నియామకాలు చేపట్టింది. గతంలో వర్షాధారంపై ఆధారపడిన రైతులు.. నేడు ప్రాజెక్టుల నీటితో ఉత్సాహంగా ఆధునికత వైపు ముందడుగు వేస్తున్నారు. ఎంజీకేఎల్ఐ ద్వారా వానకాలం, యాసంగి పంటలకు నిర్విరామంగా సాగునీరందుతున్నది. ఇక భూగర్భజలాలు సైతం పెరిగాయి. చదువుకున్న యువత ఆధునిక సేద్యం వైపు చూస్తున్నారు.
రైతు వేదికలు.. విజ్ఞాన కేంద్రాలు..
ప్రభుత్వం సదుద్దేశంతో మంజూరు చేసిన రైతువేదికలు అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. యాసంగి, వానకాలం సాగు సమయంలోనే కాదు.. అన్ని వేళలా భరోసానిస్తున్నాయి. రైతులందరూ ఒక చోట సమావేశమై పంటలపై చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఏ పంటకు ఏ మందులు వేయాలో ఒకరికొకరు చర్చించుకోవచ్చు. వ్యవసాయాధికారులు కూడా సలహాలు, సూచనిలిచ్చేందుకు సులభంగా ఉంటుంది. రైతువేదికలు విజ్ఞాన కేంద్రాలుగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అన్ని భవనాలూ పూర్తయ్యాయి..
కొల్లాపూర్‌లో రైతువేదిక భవనాలు పూర్తయ్యాయి. త్వరలో ప్రారంభించనున్నాం. ఒక్కోవేదికకు రూ.22 లక్షలు వెచ్చించింది. రైతులందరూ ఒక చోట చేరి సమావేశం కావొచ్చు. వ్యవసాయానికి సంబంధించి చర్చించుకోవచ్చు. వ్యవసాయాధికారులతో ఇష్టాగోష్టిగా మాట్లాడేందుకు ఉపయోగపడనున్నాయి.