నర్సింగ్, మెడికల్ కళాశాల పనులు పూర్తి చేయాలి
నిర్మాణంలో రోజువారీ ప్రగతిని తెలియజేయాలి
సమీక్షలో కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, నవంబర్ 15: జిల్లాలో కొత్తగా మంజూరైన నర్సింగ్, మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఆర్అండ్బీ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ మనూచౌదరితో కలిసి నిర్మాణ పనులపై అధికారులు,కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన మెటీరియల్ సమకూర్చుకోవాలని సూచించారు. లేబర్‌ను రెట్టింపు చేయాలని, మిషనరీ మెటీరియల్‌కు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. రోజువారీ ప్రగతి నివేదిక ఇవ్వాలని, ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే తనకు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ దవాఖాన పడకల పెంపునకు చేపట్టిన అదనపు నిర్మాణం సైతం డిసెంబర్15 నాటికి పూర్తి చేసి అప్పగించాలన్నారు. 24 గంటలు 3 షిఫ్ట్లతో పనిచేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఆర్అండ్బీ అధికారి భాస్కర్, దవాఖాన సూపరింటెండెంట్ శివరాం, డీఈసీ ఇండస్ట్రీస్ ప్రతినిధి మధుసూదన్, టీఎస్ఎంఐడీసీ ప్రతినిధులు పాల్గొన్నారు.