
అశ్వారావుపేట, నవంబర్ 14 : చిన్నారుల భవిష్యత్తుకు పునాది పాఠశాల.. ప్రాథమిక స్థాయి నుంచి వారు విద్యాబుద్ధులు నేర్చుకుంటేనే మేధో వికాసం.. తద్వారా వారిలో చైతన్యం మేల్కొంటుంది.. ఈ ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.. వారి కోసం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తూ, నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నది.. పాఠశాల దూరం ఉందనే కారణంతో ఒక్క విద్యార్థి కూడా డ్రాపౌట్ కావొద్దనే ఉద్దేశంతో వారికి రవాణా భత్యం అందజేస్తున్నది.. తాజాగా ఐదు నెలలకు సంబంధించిన భత్యాన్ని విడుదల చేసింది. భద్రాద్రి జిల్లాలో 2 వేల మందికి పైగా చార్జీలు అందనున్నాయి..
విద్యార్థుల కోసం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వం స్కూల్ దూరం ఉందన్న కారణంతో విద్యార్థులు స్కూలు మానివేయకూడదని, ప్రతిరోజూ బడికి వెళ్లి చదువుకోవాలని నెలనెలా రవాణా భత్యం అందిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం వంటి ఏజెన్సీ జిల్లాలో డ్రా పౌట్స్ నివారణకు రవాణా చార్జీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఐదు నెలలకు సంబంధించిన రవాణా చార్జీలు విడుదల చేసింది. ఆటోలు, ఇతర వాహనాల్లో వెళ్లటానికి వీ లుగా రవాణా చార్జీలు పేద విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 66,791 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 213 ఆవాస ప్రాంతాల నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న 1,746 మంది, ఉన్నత పాఠశాల ల్లో 201 మంది, ఇలా మొత్తం 2,047 మంది వి ద్యార్థులు ప్రతిరోజూ వాహనాల ద్వారా పాఠశాలలకు చేరుకుంటారు. వీరందరికీ ప్రభుత్వం ఐదు నె లల రవాణా చార్జీలను విడుదల చేసింది. ఏటా ప్ర భుత్వం 1వ తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం రవాణా చార్జీలను చెల్లించేది. ఈ ఏడాది నుంచి 9, 10వ తరగతి విద్యార్థులకూ వర్తింపజేస్తున్నది. దీంతో 300కు పైగా విద్యార్థులు అదనంగా ప్రయోజనం పొందనున్నారు.
రూ.61.41 లక్షలు విడుదల..
2,047 మందిలో ఒక్కో విద్యార్థికి నెలకు రూ.600 చొప్పున 5 నెలలకు రూ.61.41 లక్షల నిధులు మంజూరు చేసింది. విద్యా హక్కు చట్ట ప్రకారం విద్యార్థి ఇంటికి ప్రాథమిక పాఠశాల కిలోమీటర్, ప్రాథమికోన్నత పాఠశాల మూడు కిలోమీటర్లు, ఉన్నత పాఠశాల ఐదు కిలోమీటర్లు దూరంలో ఉంటే ఆ విద్యార్థికి ప్రభుత్వం నెల నెలా రూ.600 చొప్పున రవాణా చార్జీ చెల్లిస్తున్నది. ఇలా ఏడాదిలో 10 నెలల పాటు అందిస్తున్నది. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఐదు నెలలకు మాత్రమే ఛార్జీలు విడుదలయ్యాయి. నిధుల విడుదలపై తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
నిరుపేద విద్యార్థులకు చేయూత..
పాఠశాల దూరం ఉన్నదనే కారణంగా విద్యార్థులు బడి మానివేయకుండా ఉండేందుకు ప్రభుత్వం విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లిస్తున్నది. సోమవారం సాయంత్రం 4 గంటలలోపు అర్హులైన విద్యార్థుల జాబితాను అందజేయాలని ఎంఈవోలను ఆదేశించాం. అర్హుల జాబితా అందిన వెంటనే రవాణా భత్యం చెల్లిస్తాం.