మాస్కులు, భౌతిక దూరాన్ని విస్మరించిన వైనం
ఉమ్మడి జిల్లాలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు
పొంచి ఉన్న ముప్పు
వ్యాక్సినేషన్ పూర్తయినా జాగ్రత్తలు తప్పనిసరి..
లైట్‌గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
నిజామాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొవిడ్ నిబంధనలను విస్మరిస్తున్నారు. ఒక వైపు మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం టీకాల పంపిణీ కార్యక్రమాన్ని విస్తృతం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో భయమన్నది లేకుండా పోయింది. శానిటైజర్, మాస్కుల వాడకం అన్నది మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 70 శాతం మేర టీకా తీసుకున్నారు. ఇంకా మిగిలిన వారికి టీకాల పంపిణీ జరుగుతున్నది. కనీసం ఒక్క డోసు తీసుకోని వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. టీకా వేసుకున్న వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారు కూడా కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. దూరమవుతున్న మహమ్మారిని తిరిగి ఆహ్వానించవద్దని ప్రభుత్వ వర్గాలు సైతం హెచ్చరిస్తున్నాయి.
కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఓ వైపు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక కార్యక్రమాల ద్వారా కృషి చేస్తుంటే… మరోవైపు ప్రజలు మాస్కు లు ధరించడం, భౌతిక దూరం పాటించడాన్ని విస్మరిస్తున్నారు. ఇటీవల పండుగలు రావడం, ప్రస్తుతం పెండ్లిళ్లు జరుగుతుండడంతో ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడుతున్నారు. అలాంటి చోట్ల కూడా జాగ్త్రతలు పాటించడం లేదు. దీంతో క్రమంగా కరోనా వైరస్ మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వ జనరల్ దవాఖానలో ప్రస్తుతం 50 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు వెంటిలేటర్‌పై ఉన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు చాలా మంది ఇంటి దగ్గరే ఉంటూ మందులు వాడుతున్నారు. ఈ నిర్లక్ష్యాన్ని ఇలాగే కొనసాగిస్తే పెద్ద ప్రమాదమే పొంచి ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 200 కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రోజుకు సగటున 5 నుంచి 10 కేసులు వస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఓ మోస్తరు కేసులు వస్తున్నాయి. ఇలాంటి తరుణం లో కొవిడ్‌ను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని అధికారులు పేర్కొంటున్నారు.
లక్షణాలతో ఆగమాగం…
ఆర్మూర్ పట్టణంలో ఈ మధ్యనే ఓ వ్యాపార వేత్త కుమారుడి వివాహం జరిగింది. అంగరంగవైభవంగా పెండ్లి జరిగింది. వేలాది మంది ఆహుతులు వచ్చారు. వచ్చిన వారిలో సగానికి ఎక్కువ మందికి మాస్కులు లేవు. కనీసం పెండ్లి మండపంలో శానిటైజర్‌తో సహ జాగ్రత్తలేవీ పాటించలేదు. పెండ్లికి హాజరైన వారిలో కొంత మందికి ఇప్పుడు జ్వరా లు, జలుబు, ఒళ్లు నొప్పులు మొదలవ్వడంతో ఒక్కసారిగా అలజడి మొదలైంది. కొద్ది మంది కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడంతా పెండ్లికి అటెండ్ అయిన వారందరిలో ఇప్పుడు ఆందోళన మొదలైంది. లక్షణాలను గుర్తించిన వారు హోం క్వారంటైన్ ఉన్నారు. లక్షణాలతో బాధపడుతున్న వారు నేరుగా ప్రైవేటు దవాఖాన ల్లో చేరారు. కొద్ది మంది వాతావరణ మార్పులతో వచ్చిన ఇబ్బందులు అనుకుని ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. ఇలా ఇదొక్కటే కాదు… చాలా మంది దసరా, దీపావళి వరుస పండుగల్లో గ్రామాలకు వెళ్లి వచ్చి కరోనా లక్షణాలతో ఇక్కట్లు పడుతున్న వారు అనేక మంది ఇప్పుడు కనిపిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. చాలా మందిలో కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి కావడంతో ముప్పు కాసింత తక్కువగానే ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి మాత్రం కంటికి కనిపించకుండా సాగిపోతున్నది.
నిబంధనలు బేఖాతరు…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అనే చోట్ల నిబంధనలు బేఖాతరు అవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార, వాణి జ్య కేంద్రాల్లో భయమన్నది లేకుండా పోయింది. శానిటైజర్ వాడకం మచ్చుకూ కనిపించకుండా పో యింది. మాస్కులు వాడడం అనేది నామూషిగా ఫీలవుతున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. బస్సుల్లోనూ ప్రయాణికుల్లో మాస్కులు వాడకం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు దాపురించాయి.
కొవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో అన్ని కా ర్యకలాపాలు తిరిగి ఊపందుకుంటున్నాయి. సిని మా థియేటర్లు, విద్యా సంస్థలు పూర్తిగా తెరుచుకున్నాయి. వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. వివాహాలు, ఇతర శుభకార్యాలు, సభలు, సమావేశాలు అన్నీ నిర్వహిస్తున్నారు. అయితే జన సమూ హం ఉన్న దగ్గర చాలా మంది మాస్కులు ధరించక పోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కొవిడ్ నిబంధనలు దాదాపు గాలికి వదిలేసినట్లే స్పష్టం అవుతున్నది. భౌతిక దూరం మాటే లేదు. ఇప్పటి వరకు జిల్లాలో 70 శాతం మేర టీకా తీసుకున్నా రు. ఇంకా మిగిలిన వారికి టీకాల పంపిణీ కొనసాగుతున్నది. కనీసం ఒక్క డోసు తీసుకోని వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. వీరి కోసం వైద్య సిబ్బంది గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటికీ తిరుగుతూ వ్యా క్సిన్ వేస్తున్నారు. టీకా వేసుకున్న వారు నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ పూర్తయిన వారు కూడా కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలని సూచిస్తున్నారు. దూరమవుతున్న మహమ్మారిని తిరిగి ఆహ్వానించవద్దని ప్రభుత్వ వర్గాలు సైతం హెచ్చరిస్తున్నాయి.
ముమ్మరంగా వ్యాక్సినేషన్…
నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో వైద్యారోగ్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతున్నారు. టీకా వేసుకోని వారిని గుర్తించి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రజల్లో అక్కడక్కడ వ్యాక్సినేషన్ పట్ల ఏర్పడిన అపోహలతో కొంత మంది టీకాలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 11లక్షల 61వేల 753 డోసులటీకా పంపిణీ పూర్తయ్యింది. ఇందులో మొదటి డోసు 9లక్షల 2వేల 728, రెండో డోసు 2లక్షల 59వేల 25 డోసులున్నాయి. ఇందులో కొవాగ్జిన్ 58వేల 428 మందికి అందించారు. కొవిషీల్డ్ అత్యధికంగా 11లక్షల 3వేల 325 మందికి పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 7లక్షల 59వేల 356 డోసులు పంపిణీ పూర్తయ్యింది. ఫస్ట్ డోసు 5లక్షల 65వేల 298, సెకండ్ డోసు లక్షా 94వేల 58 చొప్పున అందించారు. ఇందులో కొవాగ్జిన్ 32వేల 423 మందికి, కొవిషీల్డ్ 7లక్షల 26వేల 933 మందికి పంపిణీ చేశారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
కరోనా వైరస్ వ్యాప్తి కంటికి కనిపించదు. రెండేండ్లుగా కరోనా కారణంగా మానవ సమాజం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితిని చూశాం. మొదటి, రెండో ఉధృతితో సమస్త సమాజం ఆగమాగమైంది. అలాంటి పరిస్థితి మరోసారి రావొద్దంటే ప్రజలంతా బాధ్యతగా కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించాల్సిందే. మాస్కులు, భౌతిక దూరం వాడడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. నిరంతరం చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభకార్యాలు,జనసమూహ ప్రాంతా ల్లో తిరిగేటప్పుడు అప్రమత్తంగా మెదులుకోవాలి. లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా కరోనా టెస్టు చేయించుకుని, డాక్టర్లను సంప్రదించాలి.