నీరా, ఈత కల్లుకు ఫిదా
ప్రకృతి వర ప్రసాదం.. దివ్యౌషధం
పరిగడుపున తాగితే చాలా లాభం
ప్రభుత్వ చేయూతతో మారుతున్న గీత కార్మికుల బతుకులు
ఈత వనాల పెంపకంతో ఉపాధి
అందోల్/మద్దూరు/దౌల్తాబాద్, నవంబర్ 13 :ప్రకృతి ప్రసాదం ఈతకల్లు. సూర్యోదయానికి ముందు తాగితే, దివ్యౌషధం. గ్రామాల్లో దొరికే ఈత కల్లుకు డిమాండ్ పెరుగుతున్నది. సుర అంటే అమృతం కూడా.. పులువబెడితే మాత్రం కల్లే.. కల్లుమీద తేరిన తెట్టెను ‘సురామండం’ అంటారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణలో గీత వృత్తిపై ఆధారపడిన వారి బతుకులు మారుతున్నాయి. హరితహారంలో ఈతవనాలను పెంచుతుండడంతో గీత కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. నీరాను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నీరా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నది. శీతాకాలంలో దొరికే ఈతకల్లుకు బాగా డిమాండ్ ఉంది. యువత ఎంతో ఇష్టంగా రుచి చూస్తున్నారు.
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ప్రకృతి వర ప్రసాదం ఈత కల్లు. చలికాలంలో సుమారు నాలుగు నెలల పాటు లభించే ఈత కల్లుకు గ్రామీణ ప్రాంతాల్లో చాలా డిమాండ్ ఉంది. పండుగొచ్చినా, ఇంటికి సుట్టాలొచ్చినా కల్లు పెట్టే దిగాల్సిందే. ఇక బోనాలు, గ్రామ దేవతల పండుగలకైతే చెప్పాల్సిన పనే లేదు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కల్లు తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలుసుకొని, అనేక మంది దీన్ని తాగుతున్నారు. ఇంతా విశిష్టత కలిగిన కల్లుకు ఉమ్మడి రా్రష్ట్రంలో ఆదరణ కరువవగా, స్వరాష్ట్రంలో మళ్లీ గీతవృత్తికి పూర్వవైభవం వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం కల్లుగీత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో పాటు హరితహారంలో భాగంగా పెద్దఎత్తున ఈత వనాలు నాటి వాటి పెంపకానికి తగిన ప్రోత్సాహాన్నిస్తుండడంతో గీతన్నలు సంతోషంగా కుల వృత్తిని నిర్వహించుకుంటున్నారు. లీటరు రూ.50 నుంచి రూ.100 వరకు ధర పలుకుతుండడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
శీతాకాలం సీజన్..
శీతాకాలంలో ఈతకల్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మంచి రుచితో పాటు ఔషధ గుణాలు కలిగి ఉండడంతో కల్లు ప్రియులు పొద్దు పొద్దున్నే తాగేందుకు ఇష్ట పడుతుంటారు. దీంతో ఈ సీజన్లో గ్రామాల్లో దొరికే కల్లుకు మంచి గిరాకీ ఉంటుంది. అందోల్ నియోజకవర్గంలోని అందోల్, వట్పల్లి, మునిపల్లి, పుల్కల్, రాయికోడ్ తదితర మండలాల చుట్టూ అత్యధికంగా ఈత వనాలు ఉండడంతో ఈ ప్రాంతం కల్లుకు కేరాఫ్‌గా మారింది. జంట నగరాలు మొదలుకుని ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుండే కల్లు సరఫరా చేస్తుంటారు.సెలవులు, ప్రత్యేక సందర్భాల్లో వేరే ప్రాంతాలనుంచి యువకులు ఈత కల్లు కోసం ఇక్కడికి వస్తుంటారు. గీత కార్మికులు ఈదులను రోజువారీగా విభజించి గీస్తారు. ఒక రోజు కొన్ని చెట్ల నుంచి బుంగలను తీసి ఆరబెడతారు. ఇలా చేయడంతో ప్రతి రోజూ ఎక్కువగా కల్లు లభిస్తుంది. చెట్టు నుంచి తీసిన కల్లును ఒక్కో లొట్టికి రూ,100,200 వరకు విక్రయిస్తారు.
బోలెడు ఔషధ గుణాలు..
ఈత కల్లులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు కూడా నిర్ధారించారు. ఈత కల్లులో నీరా అనేది అత్యంత శ్రేష్టమైనది. నీరాలో 100 మిల్లీమీటర్లలో 264 కేసీయల్ ప్రొటీన్, పిండిపదార్థం, జీరో కొలెస్ట్రాల్, లవణాలు, ఐరన్, మెగ్నీషియం, జింక్, క్యాల్షియం, సోడియం, పొటాషియం ఉంటాయి. విటమిన్స్‌లో ఎస్కారీస్ట్ ఆసిడ్, నికోటిన్, రీబో ప్లానిన్లు మెండుగా ఉంటాయి. ఈత కల్లులో అల్కాహాలు శాతం చాలా తక్కువ. ముఖ్యంగా శరీరానికి చలువ చేస్తుంది. అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పని చేస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు తాగితే కరిగిపోతాయని, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడేవారు ఈత కల్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈత కల్లు తాగడంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది. క్యాన్సర్ సోకకుండా కాపాడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు విరుగుడుగా ఈత కల్లు బాగా పనిచేస్తుందని గ్రామీణ ప్రాంత వాసులు భావిస్తున్నారు.
‘నీరా’కు బాగా డిమాండ్
ఈత చెట్టును కొత్తగా గీసే సమయంలో చెట్టునుంచి వచ్చే పానీయాన్నే నీరాగా పిలుస్తారు. కొబ్బరి నీళ్ల కంటే ఎంతో శ్రేష్ఠంగా, రుచికరంగా ఉండే నీరాను ఇష్టపడని వారుండరు. నీరాను కల్లుగా గుర్తించరు. ఇందులో ఎలాంటి పదార్థాలు కలుపకుండా చెట్టునుంచి తీస్తారు కాబట్టి ఎంతో ఆరోగ్యకరమైనదని భావిస్తారు. మధ్యాహ్నం వేళ్లలో ఈత చెట్లను గీసి లొట్టికడుతారు. రుచిగా ఉండడం కోసం నవ్వోతు, ఇలాచీ, పుదీనా తదితర పదార్థాలను పొడిచేసి లొట్టిలో వేస్తారు. దీంతో నీరా పొద్దున కల్లా మంచి రుచితో తయారవుతుంది. తెల్లారకముందే లొట్టిను చెట్టుపై నుంచి తీసి అక్కడే తాగుతారు. తాటి, ఈత కల్లును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్తగా ‘నీరా’ పాలసీని రూపొందించింది. గ్రామాల్లో సేకరించిన నీరాను ప్రత్యేక పద్ధతుల్లో నిల్వ చేసి విక్రయించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిలో భాగంగానే పట్టణాల్లో నీరా స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది.
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది
ఈతకల్లుకు గ్రామాల్లో ఆదరణ పెరుగుతుండడంతో మాకు చేతినిండా పని దొరుకుతున్నది. పంటలు, పండుగ సీజన్, చలికాలంలో కల్లు ఎక్కువగా అమ్ముడుపోతుంది. సెలవు రోజుల్లో వేరే ప్రాంతాల వారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కల్లు తాగుతారు. గత ప్రభుత్వాల హయాంలో పూర్తిగా ఆదరణ కోల్పోయిన కల్లుకు స్వరాష్ట్రంలో మంచి రోజులొచ్చాయి. కల్లుతో పాటు నీరాకూ చేయూతనివ్వడం, హరితహారంలో భాగంగా ఈత చెట్లను పెంచడం అభినందనీయం.
-నక్క నాగరాజుగౌడ్ , గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు