తప్పు చేసిన నేరస్తులకు కఠిన శిక్షలు
ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
పోక్సో కోర్టు జడ్జి సంతోశ్‌కుమార్
గద్వాలటౌన్, నవంబర్ 13: ఆడపిల్లల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఫోక్సో కోర్టు జిల్లా జడ్జి ఎం సంతోశ్‌కుమార్ పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా శనివారం జిల్లాకేంద్రంలోని బాలభవన్‌లో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జడ్జి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. మహిళలపై వివక్ష తగదన్నారు. మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు గానూ ప్రత్యేక పోక్సో కోర్టులు అందుబాటులో ఉన్నాయన్నారు. అఘాయిత్యాలు జరిగినప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చే యాలన్నారు. అదేవిధంగా జూనియర్ సివిల్ జడ్జి గాయ త్రీ మాట్లాడుతూ న్యాయ చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. బాలల హక్కుల సంరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 14 ప్రకారం దేశంలో అందరూ సమానులేనన్నారు. ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఫొటో ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్, సీడీపీవో కమలాదేవి, సీడబ్ల్యూసీ సభ్యురాలు జయభారతి, డీసీపీవో నర్సింహ, ఆర్డీఏవో సిద్ధయ్య, సఖి సీఏ జయలక్ష్మి, ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.