గృహ, వాణిజ్య సముదాయాల్లో సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఏర్పాటుకు అవకాశం
అవసరాన్ని బట్టి కిలో వాట్స్ నుంచి 10 కిలోవాట్స్ దాకా పెట్టుకునే వీలు
అందుబాటులోకి నెట్‌మీటరింగ్ వ్యవస్థ
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరుగుతున్న ఆసక్తి
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 50 ఇండ్లు, 300 దవాఖానల్లో ఏర్పాటు
సరిపడా ఉపయోగించుకుని మిగతాది విక్రయించుకోవచ్చు
జగిత్యాల, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ):కరెంట్ వినియోగం పెరిగిందా..? నెలాఖరుకు వచ్చేసరికి బిల్లు మోగుతున్నదా.. వేసవిలో అయితే మరీ వేలకు వేలు వస్తున్నదా.. రుసుం కట్టడం తలకు మించిన భారమవుతున్నదా.. మీ కోసమే రాష్ట్ర సర్కారు సోలార్‌నెట్ మీటరింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇల్లు లేదా.. వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించడమే కాదు రాయితీలు కూడా ఇస్తున్నది. ఇందుకు టీఎస్రెడ్కో ఆధ్వర్యంలో అదనపు విద్యుత్ విక్రయం ద్వారా ఆదాయం పొందేందుకు అవకాశం కల్పిస్తుండగా. ఇప్పుడిప్పుడే ఉమ్మడి జిల్లాలోని వినియోగదారుల్లో అవగాహన.. ఆసక్తి పెరుగుతున్నది. ఇప్పటికే 50మంది ఇంటి యజమానులు, 300 మంది దవాఖాన యజమానులు తమ గృహాలు, హాస్పిటళ్లపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకున్నారు. తమ అవసరాలకు తగ్గట్టు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
సౌరవిద్యుత్తు తరిగిపోని పునరుద్ధరణీయ ఇంధన వనరు. ఇందన పొదుపునకు మంచి మార్గం. భావితరాలకు ఇదే ప్రధాన వనరుగా మారడానికి అవకాశం ఉంది. దీన్ని సరైన మార్గంలో అందించేందుకు ప్రభుత్వ అనుబంధ టీఎస్రెడ్కో (తెలంగాణ రాష్ట్ర పునరుద్దరణీయ ఇంధన వనరుల అభివృద్ధి శాఖ) పనిచేస్తుంది. సోలార్‌నెట్ మీటరింగ్ (ఆన్‌గ్రిడ్ సోలార్ ఎనర్జీ సిస్టం) వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాగా, ఉత్తర తెలంగాణ జిల్లాలోని, ముఖ్యంగా, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో దీనిపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. మనం ప్రతి నెలా, ముఖ్యంగా వేసవిలో వచ్చే విద్యుత్ బిల్లులను చూసి దిగులు చెందుతుండడం సర్వసాధారణ విషయం. మార్చి మొదలు, జూలై దాకా సాధారణ, మధ్య తరగతి కుటుంబీకులు సైతం నెలకు వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. ఇక వైద్యులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఎగువ మధ్యతరగతి కుటుంబీకులు ఏడాది పొడవునా ఏసీలను వినియోగిస్తుండడంతో వారు ప్రతినెలా వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లిస్తూనే ఉన్నారు. ఇక ప్రైవేట్ కంపెనీలు, కార్యాలయాలైతే నెలకు చెల్లించే విద్యుత్ బిల్లులు చాలా పెద్ద మొత్తంలో ఉంటున్నది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ దవాఖానలు నిర్వహిస్తున్న వైద్యులు, విద్యా సంస్థలు, పలు ప్రైవేట్ కార్యాలయాల నిర్వాహకులు, వ్యాపారులు, గృహ యజమానులు సైతం ఇటీవలి కాలంలో సౌర శక్తి ఆధారిత విద్యుత్‌పై దృష్టి సారిస్తున్నారు. సోలార్ నెట్ మీటరింగ్‌తో సౌరశక్తి ఆధారంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గృహ, వాణిజ్య, వ్యాపార సంస్థలకు వాడుకుంటున్నారు. ఒకవేళ ఎక్కువ మొత్తంలో సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తే, తమ అవసరాలకు వినియోగించుకున్న తర్వాత ఇంకా విద్యుత్ మిగిలి ఉన్నట్లయితే దాన్ని విద్యుత్‌శాఖ డిస్కమ్‌లకు సరఫరా చేసేందుకు సైతం అవకాశం ఇస్తున్నది.
టీఎస్ రెడ్కో తో పాటు,ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన టీఎస్ రెడ్కోతో పాటు, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సైతం సౌర విద్యుత్ పొందేందుకు అవకాశాలున్నాయి. అయితే గృహాలకు, సాధారణ, మధ్య తరగతి వాణిజ్య వినియోగదారులు టీఎస్ రెడ్కో ద్వారా అనుమతి తీసుకుంటే మంచిదని విద్యుత్‌శాఖ, టీఎస్రెడ్కో ప్రతినిధులు చెబుతున్నారు. టీఎస్ రెడ్కో ద్వారా అనుమతి పొందిన వినియోగదారులకు సంబంధించిన సోలార్ పలకలు, ఇన్వర్టర్ల నిర్వహణతో పాటు, మరమ్మతులు వచ్చిన సమయంలో టీఎస్ రెడ్కో బాధ్యత వహిస్తుంది. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పలకలు, ఇన్వర్టర్లను బిగించుకుంటే వాటి నిర్వహణ బాధ్యతలను టీఎస్ రెడ్కో స్వీకరించడం లేదు. ఇక సౌర విద్యుత్ ఉత్పత్తి అనుమతి పొందిన వ్యక్తుల వద్ద అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదంటున్నారు. సౌర విద్యుత్‌ను వినియోగించాలనుకునేవారు ముందుగా విద్యుత్‌శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టీఎస్రెడ్కో కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంటుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాలకు సంబంధించి కరీంనగర్లో టీఎస్రెడ్కో కార్యాలయం ఉంది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత వినియోగదారులు కోరిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మేరకు సౌర పలకలు, ఇన్వర్టర్లు, కేబుళ్లు, ఇతర సామగ్రిని టీఎస్రెడ్కో అందజేస్తుంది. అలాగే అదనపు విద్యుత్‌ను పొందేందుకు సోలార్ మీటరింగ్ వ్యవస్థను గ్రిడ్‌తో అనుసంధానం చేస్తారు. టీఎస్రెడ్కో ఇచ్చే పలకలకు 25 ఏండ్లు, ఇన్వర్టర్లకు ఐదేండ్ల గ్యారెంటీ ఉంటుంది. గ్యారెంటీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మరమ్మతు చేసే బాధ్యతను టీఎస్రెడ్కో ఆధ్వర్యంలో కంపెనీ ప్రతినిధులు తీసుకుంటారు.
ఏర్పాటు, రాయితీలు ఇలా..
సోలార్ విధానాన్ని పాటించే వినియోగదారులకు ప్రభుత్వం రాయితీని సైతం అందజేస్తుంది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఉదాహరణకు ఒక కిలోవాట్ సామర్థ్యంతో నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకుంటే, రోజుకు ఐదు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ పద్ధతిలో నెలకు 150 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకున్న ఇంటి యజమానులు నెలకు 100 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకుంటే, మిగిలిన 50 యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్ కనెక్టివిటీ పద్ధతిలో డిస్కమ్‌లకు ఇచ్చేందుకు వీలుంటుంది. వినియోగదారుడు అదనంగా ఉత్పత్తి చేసి, గ్రిడ్‌కు అందించిన సౌర విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2 నుంచి రూ.3 వరకు డిస్కమ్‌లు చెల్లిస్తాయి. ఆరు నెలల్లో వినియోగదారుడు డిస్కమ్‌లకు గ్రిడ్ కనెక్టివిటీ ద్వారా అందించిన విద్యుత్ యూనిట్లను లెక్కించి, ఆ మేరకు డబ్బులను వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తారు. సౌర విద్యుత్‌ను వినియోగించడం ద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేయడంతో పాటు, కొంత ఆదాయాన్ని సైతం పొందేందుకు అవకాశాలున్నాయి. సౌర వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విషయంలో గృహ అవసరాలకు వినియోగించుకునేవారికి మాత్రమే పలకలు, బ్యాటరీలు ఏర్పాటు తదితర అంశాల్లో టీఎస్ రెడ్కో రాయితీని ఇస్తుంది. వ్యాపార, వాణిజ్య పరంగా వినియోగించేవారికి రాయితీలు ఉండవు. నెట్మీటరింగ్లో ఒకటి నుంచి మూడు కిలోవాట్స్ దాకా యూనిట్‌పై 40 శాతం రాయితీ, ఆపై వాట్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే 20 శాతం రాయితీ వర్తిస్తుంది. నెట్‌మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, దాన్ని గ్రిడ్లతో అనుసంధానం చేసుకుంటే, వినియోగదారులకు మంచి ఫలితాలు వస్తున్నాయి. సౌర విద్యుత్ తయారీ, వాడకం ప్రారంభించిన రెండు మూడేళ్లలో విద్యుత్ బిల్లుల ఆదా, అధిక విద్యుత్ విక్రయం ద్వారా పెట్టిన పెట్టుబడిని పూర్తిగా వినియోగదారులు పొందే అవకాశాలున్నాయి.
ప్రజలందరికీ అవగాహన కల్పించాలి..
సోలార్ విద్యుత్‌పై ప్రజలందరికీ అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరిని సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుం బం నెలకు వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నది. ఒక్క యూనిట్ మార్పుతో విద్యుత్ బిల్లులు పెరిగిపోతున్న సందర్భాలున్నాయి. వేసవిలో ప్రతి ఇంటి యజమాని వేలకు వేల విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న విషయం మన కు తెలిసిందే. ఈ పరిస్థితుల్లో విద్యుత్ బిల్లులు తప్పాలంటే సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఇంటిపై ఏర్పాటు చేసుకోవాలి. నా దవాఖానపై సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకున్నా. యాభై కిలోవాట్స్ సామర్థ్యం ఉన్న యూనిట్‌ను ఏర్పాటు చేశా. ఇటీవలి కా లంలో ప్రైవేట్ దవాఖానలు నిర్వహించే వైద్యులు సోలార్ విద్యుత్‌పై ఆసక్తి చూపుతున్నారు. కమర్షియల్ విభాగం వారితో పాటు, గృహ అవసరాలకు సైతం సోలార్ పవర్‌ను వాడితే మంచిది. ప్రభుత్వం, టీఎస్ రెడ్ కో సైతం ఆ దిశగా ఆలోచన చేయాలి. ప్రజలకు కొంత రాయితీలు ఎక్కువ ఇచ్చైనా, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఏర్పాటు చేయించాలి.