జిల్లాలో మద్యం షాపులు 47
వీటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, గౌడలకు 13 రిజర్వ్
దరఖాస్తుకు ఈనెల 18 వరకు గడువు
20న డ్రా పద్ధతిన ఎంపిక
జనగామ, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఆబ్కారీశాఖ చరిత్రలోనే తొలిసారి రిజర్వేషన్ల ప్రక్రియ ఆధారంగా మద్యం దుకాణాలను కేటాయించబోతున్నారు. 2019-21 వరకు రెండేళ్ల కాలంపాటు అమలులో ఉన్న మద్యం పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో ఏడుసార్లు కొనుగోళ్లపై ఫుల్ కమీషన్ ఇస్తుండగా, తాజాగా 10 సార్లకు పెంచి రెండో విడుతలో 6.4శాతం ఉన్న కమీషన్‌ను 10 శాతానికి పెంచింది. గతంలో ఉన్న 50 శాతం బ్యాంకు గ్యారెంటీని ఈసారి 25 శాతానికి తగ్గించి 25 నెలలకు సంబంధించిన గ్యారటీ ఇవ్వాలని షరతు విధించింది. ప్రస్తుతం కొత్త విధానం ద్వారా టెండర్లలో వైన్స్ షాపులు దక్కించుకునే యజమానులు 2021 డిసెంబర్ 1వ తేదీ నుంచి 2023 నవంబర్ 30 వరకు రెండేళ్ల పాటు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అమ్మకాలు నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో గతంలో 41 మద్యం దుకాణాలుండగా, ఈసారి కొత్తగా ఆరు దుకాణాలకు అనుమతి ఇస్తూ ఎక్సైజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో మొత్తం షాపుల సంఖ్య 47కు చేరింది. కొత్తగా అనుమతించిన వాటిలో జనగామ మునిసిపాలిటీ పరిధిలో 1, నెల్లుట్ల-1, తరిగొప్పుల-1, కొడకండ్ల-1, జఫర్‌గఢ్-1, దేవరుప్పుల-1 ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం జిల్లాలో ఉన్న మొత్తం 47 మద్యం దుకాణాలకు గానూ గౌడ కులస్తులకు -13, ఎస్సీలకు- 5, ఎస్టీలకు-1, జనరల్ కేటగిరీలో-28 దుకాణాలు కేటాయించారు. 2019 నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు రెండేళ్ల కాలంలో ప్రస్తుతం జిల్లాలో ఉన్న మద్యం దుకాణాల ద్వారా రూ.830.91కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో 10,50,081 మద్యం కాటన్ల బీర్లు అమ్మకాలు జరిగితే మొదటి సంవత్సరంలో రూ.386.80 కోట్లు, రెండో సంవత్సరంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో రూ.444.11కోట్ల మేరకు అమ్మకాలు జరిగాయి. బతుకమ్మ, దసరా పండగల నేపధ్యంలో జిల్లాలో ఈసారి జోరుగా అమ్మకాలు జరిగా యి. ఇప్పటి వరకున్న 41 మ ద్యం దుకాణాలు, ఐదు బార్ల ద్వారా రోజుకు సుమారు 1.83 కోట్ల అమ్మకాలు జరిగి తే కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే రూ.16.42 కోట్లు విలువైన లిక్కర్ విక్రయాలు జరిగాయి. వీటిలో ఒక్క అక్టోబర్ మాసంలో 3వ తేదీ నుంచి 17వరకు రూ.27.37 కోట్లు, 11 నుంచి 17 వరకు రూ.16.42కోట్లు, బీర్ల కార్టన్లు 26,669, మద్యం కార్టన్లు 32,935 అమ్మకాలు జరిగాయి.
డ్రా పద్ధతిన షాపుల ఎంపిక..
వైన్స్‌ల వరకే రిజర్వేషన్లు ఖరారు చేస్తున్న ఆబ్కారీ శాఖ ఈనెల 18 వరకు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించి ఈనెల 20న డ్రా పద్ధతిన ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునే వారు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం టెండరు ఫారంతోపాటు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా కాకుండా ఒక్కరు ఒక్కో వైన్స్షాపునకు రూ.2 లక్షలతో ఎన్ని దరఖాస్తులైనా ఇవ్వొచ్చు. టెండరు దక్కకుంటే నాన్ రిఫండ్(తిరిగి ఇవ్వరు) పద్ధతిలో కొత్త విధానంలో నిబంధన విధించారు. వచ్చిన దరఖాస్తులను ఈనెల 20న హైరాబాద్ రోడ్డులోని నందన గార్డెన్లో ఉదయం 11గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో పరిశీలించి వచ్చిన టెండర్లను డ్రా మద్ధతిలో కేటాయిస్తారు. మొత్తం 47 షాపులకు గానూ 10 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, అష్టమి, నవమి వంటి తిధులు, రిజర్వేషన్లపై కోర్టులో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే వారు కొంత వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది.