
సూర్యాపేట (నమస్తే తెలంగాణ)/సూర్యాపేట సిటీ, అక్టోబర్ 11 :కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థి.. పట్టుదలతో సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు. బ్యాచ్ నంబర్ 1989. ఆపై 32 ఏండ్ల సర్వీసు. 24 పోస్టింగులు. 5 ప్రమోషన్లు. లా అండ్ ఆర్డర్‌లోనే గాక డీటీసీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, రైల్వేలోనూ హై క్యాడర్లో పని చేసిన అనుభవం. సర్వీసులో ఎక్కువ భాగం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే. ఇదీ సూర్యాపేట ఎస్పీ శేరి రాజేంద్రప్రసాద్ ట్రాక్ రికార్డ్. రెండేండ్లపాటు ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తించిన భాస్కరన్ సోమవారం రిలీవ్ కాగా, రాజేంద్రప్రసాద్ ఆయన్నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మహా వీరచక్ర కర్నల్ సంతోష్‌బాబు విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. పోలీసులు వ్యక్తిగత ఇమేజ్ కోసం కాకుండా పోలీస్ ఇమేజ్ పెంచేలా పని చేయాలంటున్నారు రాజేంద్రప్రసాద్. గతంలో డీఎస్పీగా నల్లగొండలోనే పని చేసిన అనుభవాన్ని కూడా నమస్తే తెలంగాణతో పంచుకున్నారు.
సూర్యాపేట జిల్లా కొత్త ఎస్పీగా షేరి రాజేంద్రప్రసాద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన భాస్కరన్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం మహావీరచక్ర కల్నల్ సంతోష్‌బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1989లో ఎస్ఐగా పోస్టింగ్ తీసుకున్న రాజేంద్రప్రసాద్ తన 32 సంవత్సరాల సర్వీసులో 24 పోస్టింగులు, ఐదు ప్రమోషన్లు అందుకున్నారు.
స్వస్థలం ఖమ్మం
ఖమ్మానికి చెందిన ఉపాధ్యాయులు శేరి భిక్షమయ్య, యాదమ్మల కుమారుడు రాజేంద్రప్రసాద్. కోరుకొండ సైనిక్ పాఠశాలలో చదివిన అనంతరం ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేశారు. కరీంనగర్లో ఎంబీఏ పూర్తి చేసిన వెంటనే 1989లో పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎస్ఐగా ఎంపికయ్యారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ప్రొబెషనరీ ఎస్ఐగా మొదటి సారి బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్తో పాటు నల్లగొండలో కూడా కొంత కాలం పనిచేశారు.
ఉత్తర తెలంగాణలో..
ఎస్ఐగా పదేళ్ల సర్వీసు అనంతరం 1998లో సీఐగా పదోన్నతి పొందిన ఆయనకు తొలి పోస్టింగ్ కరీంనగర్ రూరల్‌లో లభించింది. అనంతరం మం థని, పెద్దపల్లి, భూపాలపల్లి, చిట్యాల, రామగుం డం, గోదావరిఖని-1, మట్టెవాడల్లో పనిచేశారు. మరో సారి గోదావరిఖనిలో సీఐగా పని చేసిన ఆయనకు అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది.
నల్లగొండలో డీఎస్పీగా ..
సీఐ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందిన రాజేంద్రప్రసాద్ తొలి పోస్టింగ్ నల్లగొండ జిల్లా కేంద్రంలో లభించింది. డీటీసీలో పని చేసిన ఆయన అనంతరం పెద్దపల్లి డీఎస్పీగా, కరీనంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీగా, సికింద్రాబాద్ రైల్వే డిప్యూటీ విజిలెన్స్ డీఎస్పీగా, ఏడాదిన్నర పాటు ఇన్చార్జి ఎస్పీగా కూడా పని చేశారు. జూలై 2020 నుంచి డీజీ కార్యాలయంలో చీఫ్ ఆఫీసర్‌గా పనిచేసిన ఆయన 2021 ఏప్రిల్‌లో నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. దాదాపు ఐదు నెలల పాటు లా అండ్ ఆర్డర్ ఏఐజీ(అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్)గా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత బదిలీపై సూర్యాపేట ఎస్పీగా వచ్చారు.
నక్సల్స్ ప్రాంతంలోనే అధికంగా..
కరీంనగర్ జిల్లాలో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉన్న సమయంలో.. ఒక సీఐ కూడా పీపుల్స్‌వార్ చేతిలో హతమయ్యాడు. అటు తర్వాత ఐదు నెలల పాటు సీఐ పోస్టు ఖాళీగానే ఉంది. ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ సీఐగా కరీంనగర్‌కు వెళ్లి రెండున్నరేండ్ల పాటు పనిచేశారు. దీంతో పాటు 23 ఏళ్ల పాటు నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనే ఆయన పని చేశారు. ఉపాధ్యాయుడైన తన తండ్రి నేర్పిన పాఠాలు, కోరుకొండ సైనిక్ పాఠశాల నేర్పిన ధైర్యంతోనే తాను అన్ని సంవత్సరాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పని చేయగలిగినట్లు ఎస్పీ తెలిపారు.
పోలీస్ ఇమేజ్ పెంచేలా పని చేయాలి : ఎస్పీ
పోలీసులు తమ వ్యక్తిగత ఇమేజ్ కోసం కాకుండా పోలీస్ ఇమేజ్ పెంచేలా వ్యవహరించాలి. డీజీపీ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బందిని ఉత్తేజ పరిచి ప్రజాసేవలో భాగస్వామ్యం చేస్తాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తూనే అక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. నేను పని చేసే ప్రాంతాన్నే నా జన్మస్థలంగా వ్యవహరిస్తాను అని ‘నమస్తే తెలంగాణ’కు ఎస్పీ రాజేం ద్రప్రసాద్ తెలిపారు. సూర్యాపేట జిల్లా ప్రజలకు సేవలందించే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. అనంతరం సిబ్బందితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఎస్పీకి జిల్లా పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. డీఎస్పీలు రఘు, రవి, సీఐలు ఆంజనేయులు, శ్రీనివాస్, విఠల్, రాజేశ్, నర్సింహారావు, మునగాల సీఐ ఆంజనేయులు, రామలింగారెడ్డి, శివరాంరెడ్డి, నర్సింహ, శివశంకర్, ఆర్ఐలు శ్రీనివాస్, గోవిందరావు, నర్సింహారావు, ఎస్ఐలు స్వాగతం పలికారు.