
ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి
యూనివర్సిటీని సందర్శించిన నాగపూర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులు
రామగిరి, అక్టోబర్ 11: పరిశోధనలపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలనే సంకల్పంతో యూనివర్సిటీల్లో సెమినార్లు, రీసెర్చ్ ప్రాజెక్టులు నిర్వహించాలని ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎంజీయూను నాగపూర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో ప్రతినిధులు, వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల అభ్యున్నతికి పరిశోధనలు ఎంతగానో తోడ్పడుతాయన్నారు. పరిశోధన చేసే పరిజ్ఞానంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించుకోవడం వల్ల ప్రపంచ స్థాయి పరిశోధన నిర్వహించవచ్చన్నారు. దీంతో విద్యార్థులు వ్యక్తిగతంగా లాభపడటమే కాకుండా యూనివర్సిటీ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయని, ఆ దిశగా ఫ్యాకల్టీ పనిచేయాలని అన్నారు. ఇందుకు రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులతో అనుసంధానంగా ఉండి ముందుకు సాగాలన్నారు. నాగపూర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులు మీనా చంద్రావర్కార్, నేషనల్ ఆర్గనైజేషన్ కార్యదర్శి శంకర్ ఆనంద్ మాట్లాడుతూ.. సంస్థ ఇప్పటికే వంద యూనివర్సిటీలతో విద్యాభివృద్ధి అంశాలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. గ్లోబల్ సైంటిఫిక్ టెక్నాలజీ అకాడమిక్ రీసెర్చ్ వంటి విషయాల్లో సహకరిస్తామని తెలిపారు. రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు అజయ్రావల్, డాక్టర్ మాని, భువనేశ్వర్, దిగ్విజయ్‌సింగ్, ఎంజీయూ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ అంజిరెడ్డి, సంధ్యారాణి, పాలకమండలి సభ్యులు డాక్టర్ ఆకుల రవి, శ్రీదేవి, కన్వీనర్లు డాక్టర్ వై.ప్రశాంతి, రామచందర్ పాల్గొన్నారు.