సీడబ్ల్యూసీ జిల్లా చైర్మన్ లక్ష్మణ్‌రావు, సీనియర్ న్యాయవాది బాలీశ్వరయ్య
అంతర్జాతీయ బాలికల దినోత్సవం
కొల్లాపూర్, అక్టోబర్ 11: సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి, రక్షణ ఆరోగ్యకరమైన విషయాల్లో అసమానతలను రూపుమాపాలని నాగర్‌కర్నూల్ జిల్లా సీడబ్ల్యూసీ చైర్మన్ లక్ష్మణ్‌రావు, సీనియర్ న్యాయవాదిబాలీశ్వరయ్య అన్నారు. మండలంలోని నార్లాపూర్‌లో ఎస్వీకే ఆధ్వర్యంలో నిర్వహించిన అంతరార్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమంలో వారు మాట్లాడారు. బాలికలపై జరిగే మానసిక, భౌతిక, లైంగిక హింసకు వ్యతిరేకంగా కఠినమైన శిక్షలను అమలుచేయాలన్నారు. అలాగే ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని నార్లాపూర్, ముక్కిడిగుండం తదితర గ్రామాల్లో సోమవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిట్టెమ్మ, సీనియర్ న్యాయవాదులు భాస్కర్‌రెడ్డి, బాలస్వామి,శిక్షణ ఎస్సై రవికుమార్, ఎస్వీకే ప్రాజెక్టు డైరెక్టర్ తిరుపాల్, సిబ్బంది సుమతి, రేణుక, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్లని ఎదగనిద్దాం, చదవిద్దాం
బల్మూరు, అక్టోబర్ 11: సమాజంలో ఆడపిల్లను పుట్టనిద్దాం, చదివిద్దాం, ఎదగనిద్దాం అని బల్మూరు ఎస్సై రాజు అన్నారు. మండలంలోని కొండనాగులలో ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లడుతూ అడపిల్లలపై దాడులు, అత్యాచారాలను ఆరికట్టాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదన్నారు. బాలికలను ఆకతాయిలు ఇబ్బందులు పెడితే వెంటనే 100కు సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అమ్మాయిలు ముఖ్యంగా చదువుపై దృష్టిసారించాలని కోరారు. 18ఏండ్లు నిండిన తర్వాతనే పెండ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులను కోరారు. అనంతరం నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. శిక్షణ ఎస్సై ప్రదీప్, హెచ్ఎం విష్ణుమూర్తి, సిబ్బంది సుధాకర్, చెన్నరాయుడు, గోవింద్, శ్రీకృష్ణ, సురేంద్ర, అచ్చయ్య, నాగమణి, అంజమ్మ తదితరులు ఉన్నారు.
ఎస్వీకే ఆధ్వర్యంలో..
కోడేరు, అక్టోబర్ 11: మండలంలోని బావాయిపల్లి, కొండ్రావుపల్లి, తీగలపల్లిలో శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో బాలికలు ర్యాలీ నిర్వహించారు. ఎస్వీకే మండల కోఆర్డినేటర్ విజయ మాట్లాడుతూ ప్రతి ఏటా అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం 10వ తరగతిలో వందశాతం మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఎస్వీకే ప్రాజెక్టు కోఆర్డినేటర్ జనార్దన్, సర్పంచులు వెంకటస్వామి, కర్రెమ్మ, శివారెడ్డి, ఎస్వీకే మండల ఆర్గనైజర్ చంద్రయ్య పాల్గొన్నారు.
బాలికల సంరక్షణకు ‘సఖి’
లింగాల, అక్టోబర్ 11: బాలికల సంరక్షణకు సఖి కేంద్రం అండగా ఉంటుందని కేంద్రం నిర్వాహకురాలు సునీత అన్నారు. సోమవారం వన్ స్టాప్ సఖి కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని అంబట్పల్లి, అవుసలికుంటలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు రవిశంకర్, ఎల్లయ్య, ఎస్వీకే మండల కో ఆర్డినేటర్ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి శివలీల తదితరులు పాల్గొన్నారు.