
పెండింగ్ కేసుల పరిష్కార వేదిక ‘లోక్ అదాలత్’
సమయం ఆదా.. ఆర్థిక నష్ట నివారణకు చెక్..
ఏండ్ల తరబడి వివాదాలకు ఫుల్‌స్టాఫ్
పోలీస్‌స్టేషన్‌లో గణనీయంగా తగ్గుతున్న కేసులు
ఒక్కరోజే 8,594 కేసుల పరిష్కారం
నిర్మల్ టౌన్ / ఎదులాపురం, సెప్టెంబర్ 11 :దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం అవుతున్నాయి. కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయిన కక్షిదారులు రాజీమార్గం ఎంచుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని జిల్లాల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇరువర్గాలకు రాజీమార్గం ద్వారా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతున్నారు. ఫలితంగా వేలాది కేసులు పరిష్కారం అవుతుండగా.. కక్షిదారులు కక్షలు మరిచి.. కలిసిమెలిసి ఉంటున్నారు.
ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి విసిగిపోయిన కక్షిదారులకు రాజీమార్గం ద్వారా రాచమార్గం చూపుతున్నది లోక్ అదాలత్. పేరుకుపోయిన వేలాది కేసులకు ఇక్కడ పరిష్కారమార్గాలు దొరుకుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ కోర్టుల పరిధిలో ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లోక్ అదాలత్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఇందులో ఇరువర్గాలకు రాజీమార్గం ద్వారా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతున్నారు. 1987లో సుప్రీంకోర్టు లోక్ అదాలత్ వ్యవస్థను ప్రారంభించింది. ఇప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేలాది కేసులు ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించారు. ఇందులో ప్రధానంగా గృహహింస, చిన్న చిన్న తగాదాలు, భూ పంచాయితీలు, చెక్‌బౌన్స్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, భార్యాభర్తల గొడవలు, రోడ్డు ప్రమాద కేసులు ఎక్కువగా పరిష్కారమవుతున్నాయి. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు కావడంతో ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తున్న పోలీసులు.. ఫిర్యాదుదారుల దరఖాస్తు మేరకు కోర్టులో కేసులు వేస్తున్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఆ కేసులు ఓ కొలిక్కి రావడం లేదు. అలాంటి కేసులకు లోక్ అదాలత్ పరిష్కారమార్గం చూపుతున్నది. దీనివల్ల కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం వృథా అవుతున్నది. దీంతో పాటు న్యాయవాదులకు సంబంధించిన ఫీజులు భారంగా మారు తున్నాయి. మానసిక ప్రశాంతత లోపిస్తున్నది. కుటుంబ తగాదాలైతే కక్షలు పెంచుకొని భవిష్యత్‌లో మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉండడంతో ఈ లోక్‌అదాలత్ ద్వారా సత్వరం పరిష్కారాన్ని చూపేందుకు ఉపయోగపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 8,594 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్ ప్రయోజనాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
15 ఏళ్ల భూ సమస్యకు పరిష్కారం చూపింది..
మాది దిలావర్పూర్ మండలంలోని లోలం గ్రామం. గ్రామ శివారులో ఉన్న 519/2లో 15 ఏళ్ల క్రితం భూ వివాదం ఏర్పడింది. ఆ భూమి నాదంటే నాదని ఇద్దరం భూమివద్దనే కొట్టుకున్నాం. భూమి విషయంలో పోలీస్‌స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదు చేసుకున్నాం. దీంతో ఇద్దరిపై కేసు నమోదై కోర్టుల చుట్టూ 15 ఏళ్లుగా తిరుగుతున్నాం. ఇటీవల పోలీసులు, గ్రామపెద్దలు జోక్యం చేసుకొని భూ వివాదాన్ని పరిష్కరించారు. ల్యాండ్ రికార్డు సర్వే అధికారులతో సర్వే చేయించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన రాజీమార్గాన్ని కుదిర్చారు. భూ పరిష్కార అంగీకారానికి కృషి చేశారు. దీంతో కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసు కావడంతో ఇద్దరం రాజీ కుదుర్చకోవడంతో లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైంది. 15 ఏళ్ల పాటు భూ వివాదం కారణంగా ఇద్దరం వైరివర్గంగా విడిపోయి మానసికంగా ఎంతో బాధపడ్డాం. లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం కావడం చాలా సంతోషంగా ఉంది.
మాకు రుణ విముక్తి లభించింది..
బోథ్, సెప్టెంబర్ 11 : బోథ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మానాన్న కరాడే మాధవ్‌రావు పంట పెట్టుబడి కోసం 2020 జూన్‌లో రూ 1,75,00 రుణం తీసుకున్నాడు. అనారోగ్యంతో డిసెంబర్లో చనిపోయాడు. తీసుకున్న రుణం డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో ఈ యేడాది పంట రుణం అందుకోలేకపోయాం. మానాన్న పేరు మీద భూమి మొత్తం ఉండడంతో మా పేరు మీద మార్పిడి జరగలేదు. బ్యాంకు అధికారులు మా నాన్న తీసుకున్న రుణం చెల్లించాలని కోర్టులో కేసు వేశారు. మూడు విడుతలుగా డబ్బులు చెల్లించాం. మిగిలిన రూ 17వేలు లోక్ అదాలత్‌లో చెల్లించడంతో న్యామూర్తి కేసు కొట్టి వేశారు. దీంతో మాకు రుణం నుంచి విముక్తి కల్పించారు.
రెండేండ్ల తర్వాత న్యాయం జరిగింది..
ఎదులాపురం, సెప్టెంబర్11: ఈయన పేరు తొగ్గిరెడ్డి నడిపెన్న. వయసు 38. ఆదిలాబాద్ మండలం తంతోలి గ్రామం. భార్య పోసానితో కలిసి కూలీ పనులు చేస్తుంటాడు. 30-5-2018లో లోకారిలో మిషన్ భగీరథ పైపులు లోడింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో జేసీబీ టైర్ ఇతని ఎడమ కాలిపై నుంచి వెళ్లడంతో కాలు విరిగింది. ఆదిలాబాద్ రిమ్స్‌లో సర్జరీ తర్వాత రెండు సంవత్సరాలు విశ్రాంతి తీసుకోవడంతో బతుకు కష్టమైంది. ఈ కాలంలో భార్య పోసాని కూలీనాలి చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఈ ఉదంతంలో భార్యాభర్తలు ఆదిలాబాద్ రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా ఈ కేసు వాదోపవాదాలు కోర్టులో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ లోక్ అదాలత్‌కు ఇద్దరు తమ సమస్య పరిష్కరించాలని విజ్ఞాపన చేసుకున్నారు. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ మహిళా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఈ కేసుకు సంబంధించి బాధితుడు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పరస్పర అంగీకారానికి వచ్చారు. జేసీబీకి ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రకారం .. బాధితుడికి జేసీబీ మూలంగా నష్టం వాటిల్లింది కనుక రూ.7.50 లక్షలు పరిహారంగా ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీవారు అంగీకరించారు. ఈ నిర్ణయం తమకు అంగీకారమేనని బాధితుడు ఒప్పుకోవడంతో ఈ కేసు పరిష్కారమైంది. ఈ కేసును బాధిత కుటుంబం తరఫున న్యాయవాది షేక్ మన్షీర్ వాదించారు. తమకు న్యాయం జరిగిందని బాధిత కుటుంబం హర్షం వ్యక్తంజేసింది.
-తొగ్గిరెడ్డి నడిపెన్న
కుటుంబాన్ని ఏకం చేసింది..
మాది నర్సాపూర్ (జి) మండలంలోని చాక్పెల్లి గ్రామం. నర్సాపూర్‌కు చెందిన సునీతతో 2000 సంవత్సరంలో పెళ్లి అయింది. మాకు ఇద్దరు పిల్లలున్నారు. పది సంవత్సరాల పాటు సంసారజీవితాన్ని హాయిగా గడుపుతున్న నేపథ్యంలో చిన్న చిన్న గొడవల కారణంగా మా ఇంట్లో వివాదం ఏర్పడింది. నా భార్య సునీత నాపై 2017లో వరకట్నం కోసం వేధిస్తున్నారని నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌లో 498/ఏ కేసు పెట్టింది. అప్పటి నుంచి మేము కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. నాతో పాటు నా భార్య కూడా కోర్టుల చుట్టూ తిరగడంతో పిల్లలు కూడా ఆవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల పోలీసులు భార్యాభర్తలిద్దరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. తప్పు ఒప్పులను పక్కన పెట్టి ఇద్దరూ పిల్లాపాపలతో హాయిగా ఉండాలని సూచించడంతో రాజీకి వచ్చాం. ఇద్దరి అంగీకారం మేరకు శనివారం లోక్ అదాలత్ ద్వారా కేసును పరిష్కరించుకున్నాం. నాలుగేళ్లుగా కోర్టుల చుట్టూ తిరగడంతో సమయం వృథా కావడమే కాకుండా మానసిక ప్రశాంతత కరవైపోగా.. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరిగినందుకు ఎంతో ఆనందంగా ఉంది.
రాజీతోనే.. ఏకమయ్యం..
నా పేరు సుచరిత. మాది లోకేశ్వరం మండలం వడ్తాల్. టిక్‌టాక్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాకు చెందిన వేము ఆన్లైన్లో పరిచయమయ్యాడు. ఆరు నెలలుగా ఒకరినొకరు చాటింగ్ చేసుకుంటూ ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. 2020లో ఇద్దరం కలిసి అమ్మానాన్నలకు తెలియకుండా ఆలయంలో పెళ్లి చేసుకున్నాం. మా అమ్మానాన్నలు నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో తన కూతురును కిడ్నాప్ చేసినట్లు కేసు పెట్టారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. నేను, మా ఆయన కలిసి ఉంటామని పోలీసులకు చెప్పాం. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, బలవంతంగా పెళ్లి చేసుకోలేదని చెప్పాం. దీంతో పోలీసులు మా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి కేసు పరిష్కరించేందుకు కృషి చేశారు. ఇద్దరూ రాజీమార్గానికి వచ్చి లోక్ అదాలత్ ద్వారా శనివారం ఉన్న కేసును కొట్టివేసుకున్నాం.
సత్వర కేసుల పరిష్కారానికి మార్గం..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1987 నుంచి లోక్ అదా లత్ ద్వారా కేసుల పరిష్కారానికి సత్వరం కృషి చేస్తు న్నాం. రాజీమార్గమే రాచమార్గం అనే ఏకైక లక్ష్యంతో కోర్టు పరిధిలో ఉన్న వివిధ కేసుల్లో ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. రాజీమార్గం కుదిర్చి ఇరువర్గాలకు సమ్మతమైన తీర్పు ఇవ్వడ మే లోక్ అదాలత్ ఉద్దేశం. ఇందులో భార్యాభర్తల గొడవలు, గృహహింస, భూతగా దాలు, కొట్లాటలు, రోడ్డు ప్రమాద కేసులు, మెయింటెనెన్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేసు నమోదై ఏళ్ల తరబడి న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసిక ప్రశాంతత, కుటుంబంలో ఐక్యత లోపించడం వంటి కారణాలను గుర్తించారు. లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు వీలైనంత త్వరగా రాజీ కుదిర్చి కేసులను పరిష్కరించేందుకు ఉపయోగపడుతున్నాయి. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నాం.
మానసిక వేదనకు చెక్..
గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, చట్టం ఉల్లంఘించిన కేసుల్లో పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదై ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగేవారు. దీంతో వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. తెలిసీ తెలియక చేసిన తప్పు లకు విచారణ పేరుతో ఏళ్ల తరబడి ఇరువర్గాలు కోర్టుకు హాజరవుతున్నాయి. దీంతో మానసిక ప్రశాంతత లోపించడమే కాకుండా ఇరువర్గాల మధ్య మరింత కక్ష పెరుగు తున్నది. ఇది భవిష్యత్ లో మరిన్ని అనర్థాలకు దారి తీస్తున్నది. అలాంటి వారికి లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చూపడంతో న్యాయవ్యవస్థకు మంచి పేరు వచ్చింది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో వేలాది కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు ఇరువర్గాల వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. – రమణాగౌడ్, న్యాయవాది, నిర్మల్
పోలీస్‌స్టేషన్‌లో కేసులు తగ్గుతున్నాయి..
పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎన్నో కేసులు ఉండడంతో వా రందరూ కోర్టులో హాజరుకావాల్సి ఉంటుంది. వేలాది కేసులు కోర్టులో ఉండడంతో పోలీసులపై కూడా పని భారం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కోర్టులో లోక్ అదాలత్ నిర్వహణతో చిన్న చిన్న కేసులన్నీ పరిష్కార మవుతున్నాయి. ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన రాజీమార్గాన్ని కుదర్చిన తర్వాతే లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. పోలీస్‌స్టేషన్‌లో ఎక్కువగా 498, 324, 337, 38, 34 వంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఈ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం కావడంతో పోలీస్‌స్టేషన్‌లో కేసులు తగ్గిపోతున్నాయి.