క్షేత్రపాలకుడికి ఆకుపూజ
శ్రీవారి ఖజానాకు రూ.8,55,904 ఆదాయం
యాదాద్రి, జనవరి11 : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహ స్వామి ఆలయంలో మంగళవారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆండాళ్ అమ్మవారికి నిరాటోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలోని కల్యాణమండపంలో అమ్మవారిని దివ్యమనోహరంగా అలంకరించి వేడుకలు జరిపారు. గోదాదేవికి మహిళా భక్తులు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. స్వామి, అమ్మవారు మంగళస్నానం ఆచరిస్తారని, భోగి పండుగ సందర్భంగా గోదాదేవి కల్యాణం జరుగబోతున్న నేపథ్యంలో ఈ నిరాటోత్సవాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకుడు మోహనాచార్యులు తెలిపారు. ఆలయ అర్చక బృందం వేదమంత్రాలను పటిస్తూ తిరుప్పావై పూజలు చేశారు. నిరాటోత్సవం రెండో రోజులో భాగంగా 27వ విశేష కూడారై పాశురాలను పఠించారు. ఇందులో భాగంగా అమ్మవారికి పాయసం నివేదించారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ
యాదాద్రీశుడి చెంత వెలిసిన క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ పర్వాలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణుపుష్కరిణి చెంత, పాతగుట్ట ఆలయంలో కొలువుదీరిన క్షేత్రపాలకుడిని కొలుస్తూ అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభిషేకించారు. వేదమంత్ర పఠనాలతో ఆంజనేయస్వామికి సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరణ చేశారు. తమలపాకులతో అర్చించి వివిధ రకాల పూలమాలలతో అలంకరించి ఆంజనేయుడి సహస్రనామ పఠనాలతో నాగవల్లి దళార్చనలు నిర్వహించారు. లలితా పారాయణము చేసి స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. నిత్యపూజల్లో భాగంగా మొదటగా స్వామివారి బాలాలయంలో హోమం, లక్ష్మీనరసింహుల నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఆలయ మహామండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం అలంకార జోడు సేవోత్సవాన్ని సంప్రదాయంగా జరిపారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బాలాలయంలో తిరుప్పావై వేడుకలు జరిగాయి. ఆలయ అర్చకులు వేదమంత్రాలను పటిస్తూ గోదాదేవి, శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలలో తొమ్మిదో పాశురాన్ని పఠించి భక్తులకు వినిపించారు. అన్ని విభాగాలతో కలిపి స్వామివారికి రూ.8,55,904 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.