ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
రూ.1.12కోట్లతో వ్యవసాయ మార్కెట్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కొల్లాపూర్, అక్టోబర్ 10: కరోనా కష్టకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేసినట్లు, ఇది రైతు ప్రభుత్వమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మార్కెట్ యార్డులో రూ.కోటి12లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్, సీసీరోడ్డు నిర్మాణానికి పానగల్, చిన్నంబావి మండలాల్లో పెండింగ్‌లో ఉన్న గోదాంల నిర్మాణాల పనులకు డీసీసీబీ డైరెక్టర్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే బీరం ఆదివారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ యార్డు హమాలీలకు ప్రభుత్వం మంజూరు చేసిన గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. తమకు గుర్తింపు కార్డులు ఇచ్చినందుకు హమాలీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు శాలువా కప్పి స్వీట్లు తినిపించారు. పట్టణంలోని 4వ వార్డులో రూ.16లక్షలతో హెల్త్ సెంటర్‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోళ్ల విషయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేయాలని చూశారని విమర్శించారు.
30ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న మార్కెట్ యార్డులోని హమాలీలకు గుర్తింపు కార్డుల సమస్య శాశ్వత పరిష్కారమైందన్నారు. సింగవట్నం నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు నది నీటిని గ్రావిటీ ద్వారా నింపి 30వేల ఎకరాల రైతుల భూములకు సాగునీరందుతుందన్నారు. ఈ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తికావచ్చిందన్నారు. వీటితోపాటు ఎన్మన్‌బెట్ల వీరనాయిని చెరువు, బాచారం హైలెవల్ బ్రాంచి కెనాల్, జిల్దార్ తిప్ప ప్రాజెక్టుకు నీటిని అందించే పనులకు నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపినట్లు ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు. అర్హులైనవారు ఆసరా పింఛను కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు.
విద్యార్థులకు సన్మానం
నవోదయ ప్రవేశ పరీక్షలో 2021-21వ సంవత్సరానికిగానూ 6వ తరగతిలో అర్హత సాధించిన కొల్లాపూర్ పట్టణానికి చెందిన వైశ్విక, ఝాన్సీ, చరణ్‌తేజ్, అభిచంద్ర, శ్రీవర్షిత, మణిధర్నాయక్ను శాలువా కప్పి ఎమ్మెల్యే బీరం అభినందించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు కృష్ణయ్య, రాజేందర్‌గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నిరంజన్, నాయకులు బాలు, జంబులయ్య, పరశురాంగౌడ్, మహేశ్, చంద్రశేఖరాచారి, కౌన్సిలర్లు కృష్ణ, సత్యంయాదవ్ ఉన్నారు.