
పచ్చందాలతో ఆకర్షిస్తున్న పల్లెలు
ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
ఊరూరా ఏఈవోలు, రైతు వేదికల ఏర్పాటు
మత్స్య, జీవాల పెంపకానికి పూర్వవైభవం
గ్రామీణ వ్యవస్థకు నూతన ఒరవడి
ఉపాధి కేంద్రాలుగా మారిన ఊర్లు
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 10;ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు;పల్లెలకు కొత్తకళ వచ్చింది.. ఉపాధి లేక పట్టణాలు, నగరాల బాటపట్టిన పల్లెవాసులు తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు చేయూతనిస్తోంది. కుల, చేతి వృత్తులకు అండగా నిలుస్తున్నది. అంతేకాకుండా, జలవనరులను ఒడిసిపట్టడంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. మత్స్య, పాడి పరిశ్రమలకు జవసత్వాలు వచ్చాయి. గ్రామీణ వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏ పల్లె చూసినా ఊరినిండా జనం ఉంటున్నారు. చేతినిండా పనిదొరుకుతున్నది. చిన్నాభిన్నమైన గ్రామీణ వ్యవస్థ తిరిగి ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారిన పల్లె జీవనవిధానం.. ఉపాధి కల్పనపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, తర్వాత పల్లెలను పోల్చుకుంటే అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో చేతినిండా పనిలేక పల్లె వాసులు పట్టణాలు, నగరబాట పట్టారు. ప్రోత్సహాకాలు లేక చేతి వృత్తులు, కుల వృత్తులు కనుమరుగయ్యాయి. గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో పల్లెలకు జీవం వచ్చింది. ఒక్కొక్కటిగా వ్యవసాయ అనుబంధ రంగాలు ప్రగతిలోకి వచ్చాయి. పల్లెలకు మెరుగైన వసతులు సమకూరాయి. చేతినిండా పనులు దొరికి వలస వెళ్లిన వారు తిరిగి పల్లె బాట పట్టారు. కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చింది. ప్రభుత్వ చర్యలతో నేడు పల్లెలు పచ్చదనం, పరిశుభ్రత, ఉపాధి కల్పనతో కళకళలాడుతున్నది.
ఏటేటా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
సరిగ్గా ఏడేళ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 3లక్షల ఎకరాలకు పరిమితం కాగా నేడు 5.96 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం చేరింది. నాడు వరి, పత్తి, పంటలకే పరిమితమైన సాగు నేడు బహుళ పంటల సాగు జరుగుతున్నది. పత్తి దాదాపుగా ఏటా 2.50 లక్షల ఎకరాల పైబడి సాగు జరుగుతుండగా, వరి మరో 2 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అదే విధంగా ఆయిల్ఫామ్ సాగులో రాష్టంలోనే ఖమ్మం జిల్లా రైతాంగం పేరు ప్రఖ్యాతులు గడించారు.
ఉపాధి కేంద్రాలుగా మారిన ఊర్లు
వ్యవసాయం చేసే రైతు కుటుంబాలతో పాటు, రైతు కూలీలకు సైతం పుష్కలంగా పనులు దొరుకుతున్నాయి. ప్రస్తుతం మహిళా కూలీలకు రోజుకు రూ.300 పైగానే సంపాదిస్తున్నారు. పత్తిలో పాటు చేసిన, గొర్రుకు అయితే విపరీతమైన డిమాండ్ పలుకుతుంది. దీంతో రోజుకు అరకకు కనీసం 1,500 ధర పలుకుతుంది. ప్రస్తుతం పత్తి పంట చేతికి వస్తుండటంతో నూతన పత్తిని చేలలో తీయుంచుకునేందుకు రైతులు రెండు రోజుల ముందుగానే కూలీలను మాట్లాడుకుంటున్నారు. అదే విధంగా మిర్చితోటల సాగు ప్రారంభం కావడం, వరినాట్లు ప్రారంభం కావడంతో పల్లెవాసులు పంట పనులలో నిమగ్నం అయ్యారు. ఉదయం 9దాటితే ఊర్లల్లో కేవలం చిన్నారులు, వృద్ధులు మాత్రమే కనపడుతున్నారు.
నగరంలో పలచబడ్డ కూలీల అడ్డాలు
కొద్ది రోజుల వరకు నగరంలో, పట్నాలలో అడ్డామీద ఎక్కడ చూసిన స్థానికులతో పాటు, పల్లెప్రజలు గుంపులుగా దినసరి కూలీల కోసం వేచి చూస్తుండే దృశ్యాలు కనపడేవి. తెల్లారే సరికి పల్లెనుంచి పట్నం చేరుకొని తిరిగి రాత్రి అయ్యే సరికి సొంతూరు చేరుకునే వారు. అయితే లాక్డౌన్ సమయంలో అడ్డాపనులు లేకపోవడంతో పల్లెప్రజలు గ్రామాల్లోనే ఉండిపోయారు. లాక్డౌన్ ముగిసిన తరువాత గ్రామాల్లో వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పల్లెల నుంచి పట్నాలకు వచ్చే దినసరి భవననిర్మాణ, ఇతర కార్మికుల రాక గణనీయంగా తగ్గిపోయింది. చేతినిండా కూలి దొరకడంతో గ్రామాల్లోనే పనులు చేసుకుంటున్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు పూర్వవైభవం
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు పూర్వవైభవం వచ్చింది. సాగు చేసే రైతులకు అదనపు ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ అధివృద్ధిపై ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఇవ్వడంతో ఈ రెండు శాఖలు బలోపేతం అయ్యాయి. నానాటికి ఉనికిని, ఉపాధి కోల్పోతున్న మత్స్యకార్మికులకు, పెంపకందారులకు ఆర్థిక భరోసా లభించింది. ఉచిత చేపపిల్లల పంపిణీ, 75శాతం రాయితీపై గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
పచ్చదనం, పరిశ్రుభతతో పల్లె శోభితం
పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలు పూర్తిగా మారాయి. మౌలిక వసతుల కల్పనతో పట్టణాలను తలపిస్తున్నాయి. ప్రతి గ్రామానికి ప్రకృతి వనం, ఊరు శివారులో వైకుంఠధామాలు, ఇతరత్ర సదుపాయాలతో పల్లెలు అభివృద్ధి చెందాయి. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, పారిశుధ్యకార్మికుల నియామకంతో ఊర్లలో మరికొందరికి ఉపాధి కల్పించినైట్లెంది. రైతుల కోసం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రైతు వేదికను నిర్మించారు. సాగుకు అవసరమైన ప్రణాళికలు, మార్కెటింగ్, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ రైతు వేదికలు ఎంతో క్రియాశీలకం కానున్నాయి.
సాగు పెరగడంతో ఉపాధి అవకాశాలు
జిల్లా వ్యాప్తంగా భారీగా సాగు విస్తీరణం పెరగడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. దీంతో రైతు సేవాకేంద్రాలు, విత్తన ఎరువుల షాపులు పెరుగతున్నాయి. రైతు కూలీలకు కూడా చేతినిండా పనులు దొరుకుతున్నాయి. గ్రామాల్లోనే విత్తన, ఎరువుల పంపిణీ జరుగుతుంది. చివరికి మార్కెటింగ్ సౌకర్యం కూడా గ్రామాలకు చేరువైంది.
-ఎం విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి
సాగునీటి వనరులు పుష్కలం..
నేడు జిల్లాలో మూడు కాలాల పాటు వ్యవసాయం పనులు జోరుగా సాగతున్నాయి. ఉమ్మడి రాష్టంలో వానాకాలం సాగుకే అవసరమైన మేర విత్తనాలు, ఎరువులు సకాలంలో దొరకకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. పైగా సర్కార్ అన్ని విధాల సహాయం చేస్తుంది. సాగు నీటివనరులు పుష్కలంగా ఉన్నాయి. వేలాది మంది కూలీలు ఉపాధి కోసం ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు వలసబాట పడుతున్నారు.
-నల్లమల వెంకటేశ్వరరావు,రైతుబంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
జీవాల రాకతో పెంపకందారులకు ఉపాధి
రాయితీ గొర్రెల రాకతో జిల్లా వ్యాప్తంగా కురుమ, యాదవులకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. అంతే కాకుండా మాంసం ఉత్పత్తుల ధరలు నియంత్రణలో ఉన్నాయి. 75శాతం రాయితీపై గొర్రెలను అందించిన సర్కార్కు రుణపడి ఉంటాం. గతంలో పెంపకందారులకు ఉపాది లేక పట్టణాలు, నగరాలకు వలసపోయారు. సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఈ పథకం ప్రవేశపెట్టడంతో ఉపాధి దొరికింది.
-మేకల మల్లిబాబు యాదవ్, గొర్రెల పంపకందారుల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు