పల్లెప్రగతితో అభివృద్ధి పథం
మురికి కాలువలకు మోక్షం
ఆహ్లాదంగా ప్రకృతి వనం
ఎవెన్యూప్లాంటేషన్తో హరిత స్వాగతం
అన్ని హంగులతో వైకుంఠధామం
ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం
మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో 950 గృహాలు, 4,279 జనాభా ఉంది. నెలకు రూ.5.29 లక్షల చొప్పున ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూ.కోటి నిధులు వచ్చాయి. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మురికి కాలువలకు ఈ నిధులతో మోక్షం లభించింది. శిథిలమైన మురికి కాలువలు, రోడ్లపై ప్రవహిస్తున్న మురికి నీరు వంటి ప్రదేశాలను గుర్తించారు. రూ.45 లక్షలతో వంద మీటర్లకు ఒకటి చొప్పున 20 మురికి కాలువలను నిర్మించి పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. దీంతో గ్రామంలో దోమల బెడద తగ్గుముఖం పట్టింది. రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్, రూ.2.50 లక్షలతో సామూహిక మరుగుదొడ్డి, రూ.15 లక్షలతో వైకుంఠధామం నిర్మాణాలతో పాటు రూ.6.71 లక్షలతో రెండు పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. రూ.7 లక్షలు వెచ్చించి గ్రామంలోని 420 విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లను అమర్చారు. రెండు పాడుబడిన బావులు పూడ్చివేసి, శిథిలావస్థలో ఉన్న ఐదు ఇళ్లను కూల్చివేశారు. 2019 ఆగస్టులోనే పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను సమకూర్చుకున్నారు. కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన చెత్తబుట్టలతో పాటు ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను ట్రాక్టర్ సహాయంతో డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు.
మణిహారంగా ప్రకృతివనం
మొదట ఏర్పాటు చేసిన ప్రకృతివనం గ్రామానికి దూరంగా ఉండడంతో బస్టాండు ప్రాంతంలోని రక్షిత మంచినీటి ట్యాంకుల వద్ద మరొకటి ఏర్పాటు చేశారు. 18 గుంటల స్థలంలో కాలిబాటలను ఏర్పాటు చేసి రెండు వేల మొక్కలను నాటారు. ఫాక్సెటిల్ ఫామ్, పెనాననస్, క్రోనక్రోబస్, పాండా, రేజోర్, విరిచివిరిగిన్, ఉజోనియా, సైకస్, మందారం వంటి రకరకాల మొ క్కలను నాటి ఆహ్లాదానికి నిలయంగా మార్చా రు. పార్కును తలపించేలా అక్కడక్కడ పచ్చని గడ్డితో మైదానం ఏర్పాటు చేశారు. బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణానికి నిలయంగా తీర్చిదిద్దారు. అలాగే ప్రధాన రహదారి వెంబడి నాటిన మొక్కల సంరక్షణకు సర్పంచ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రోడ్డుకిరువైపులా కందకాలు తీయించి మొక్కలను సంరక్షించడంతో ఏపుగా పెరిగి దారిపొడవునా ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్నాయి.
గతంలో ఇంత అభివృద్ధి లేదు
గతంలో ఏ ప్రభుత్వం కూడా గ్రామాల అభివృద్ధికి ఇలాంటి ప్రణాళిక అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలో పూర్తిస్థాయిలో డ్రైనేజీలు లేక మురికినీరు రోడ్లపై పారేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మురికి కాలువల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే ఈ సమస్య పరిష్కారం కాకపోయేది. అందరి సహకారంతో గ్రామాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా.