ఇబ్రహీంపట్నం/పరిగి, జనవరి 9 : కరోనా కట్టడిలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 60 సంవత్సరాలు పైబడినవారితోపాటు ఫ్రంట్ లైన్ వర్కర్లకు సోమవారం నుంచి బూస్టర్ డోసులు వేయడానికి వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. సోమవారం నుంచి 60 ఏండ్లు పైబడిన సుమారు లక్షమందితో పాటు ఫ్రంట్‌లైన్ వర్కర్లను గుర్తించి వారికి బూస్టర్ టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సెంటర్లతో పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లతోపాటు మొబైల్ వాహనాల ద్వారా కూడా ఈ టీకా వేయడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఆయా పీహెచ్సీలలో ఇప్పటికే బూస్టర్ డోసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మొదటి విడుతలో 60సంవత్సరాలు పైబడినవారు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అధిక ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలు, మున్సిపాలిటీల పరిధిలో అర్హులైన వారి జాబితాను తయారుచేశారు. ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు, వైద్యారోగ్యశాఖ, మున్సిపల్, రెవెన్యూ, పోలీసులతో పాటు తదితర శాఖల వారికి ఈ టీకా ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రెండో డోసు టీకా తీసుకున్న 9 నెలలు లేదా 37 వారాల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మొదటి, రెండో డోసులు ఏ టీకా తీసుకుంటే, ఈ డోసు సైతం అదే టీకా తీసుకోవాలి. ఈనెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది.
378 కేంద్రాల్లో నేటి నుంచి బూస్టర్ డోసుల పంపిణీ
రంగారెడ్డిజిల్లాలో 378 కేంద్రాల్లో సోమవారం నుంచి అర్హులైన వారందరికి బూస్టర్ డోసులను ఇవ్వడానికి వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. బూస్టర్ డోసులకు ఎంపికైనవారు ముందుగా సంబంధిత సెంటర్లల్లో పేర్లను ఆన్లైన్ చేసుకోవడం కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటుచేశారు. ఈ కేంద్రాల్లో ఆన్లైన్ కోసం ఒక సెంటర్‌ను ఏర్పాటుచేశారు. టీకా తీసుకున్న తరువాత పర్యవేక్షణలో ఉంచడం కోసం కూడా ప్రత్యేక వసతులను కల్పించారు. బూస్టర్ డోస్ కరోనా కట్టడిలో కీలకపాత్ర పోషిస్తుందని, అర్హులైన ప్రతిఒక్కరూ ఈ డోసును తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్, నియోజకవర్గాలతోపాటు నగరశివారుల్లోని జీహెచ్ఎంసీ ఏరియాల్లో కూడా ఈ డోసులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడుతలో జిల్లాలో సుమారు లక్షమందికి బూస్టర్ టీకాలు వేయాలని నిర్ణయించారు. మిగిలిన వారికి రెండో విడుతలో ఈ డోసులు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 59,928 మందికి టీకాలు
పరిగి, జనవరి 9 : వికారాబాద్ జిల్లాలో 4364 మంది హెల్త్‌కేర్ వర్కర్లు, 5704 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడినవారు 49860 మంది ఉన్నారు. మొదట ఈ మూడు విభాగాల వారికి టీకాలు ఇవ్వడానికి నిర్ణయించారు. జిల్లా పరిధిలో 4364 మంది హెల్త్‌కేర్ వర్కర్లలో 4324 మంది కొవీషీల్డ్, 40 మంది కొవాగ్జిన్, 5704 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 5026 మంది కొవీషీల్డ్, 678 మంది కొవాగ్జిన్, 60 ఏండ్లు పైబడినవారు 49860 మంది కాగా.. 48830 మంది కొవీషీల్డ్, 1030 మంది కొవాగ్జిన్ తీసుకున్నారు. ఈ మూడు విభాగాలు కలిపి జిల్లాలో కొవీషీల్డ్ 58180 మంది, కొవాగ్జిన్ 1748 మంది తీసుకున్నారు. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 27 సర్కారు దవాఖానల్లో టీకాలు వేస్తారు. తాండూరులోని జిల్లా దవాఖాన, పరిగి, కొడంగల్, వికారాబాద్, మర్పల్లిలలోని క్లస్టర్ హెల్త్ సెంటర్లు, 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేపట్టారు.
27 కేంద్రాల్లో డోసులు : తుకారాంభట్, వికారాబాద్ జిల్లా వైద్యాధికారి
వికారాబాద్ జిల్లా పరిధిలో 27 కేంద్రాల్లో సోమవారం నుంచి బూస్టర్ డోసు టీకాలు వేస్తారు. జిల్లాలో 4364 మంది హెల్త్‌కేర్ వర్కర్లు, 5704 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 49860 మంది 60 ఏండ్లు పైబడినవారు ఉన్నారు. రెండో డోసు టీకా తీసుకున్న తర్వాత 9 నెలలు లేదా 37 వారాలు పూర్తయినవారికి ఈ డోసు ఇస్తారు. డ్యూ డేట్ పూర్తయినవారు తప్పనిసరిగా టీకా తీసుకోవాలి. ఇందుకు సంబంధించి అవసరం మేరకు టీకాల నిల్వలున్నాయి.
అన్ని ఏర్పాట్లు పూర్తి : స్వరాజ్యలక్ష్మి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లతోపాటు 60సంవత్సరాలు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్‌లు అందజేసేందుకు జిల్లావ్యాప్తంగా 378 కేంద్రాల్లో టీకా వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఉదయం 10గంటల నుంచి టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉంటున్నందున.. ప్రతి ఒక్కరూ టీకా వేసుకుని కరోనాను నివారించేందుకు కృషిచేయాలి.