పరిగి, నవంబర్ 8 : పోడు భూముల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వికారాబాద్ కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. అటవీ భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న అందించేందుకు సోమవారం నుంచి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. పోడు భూముల పరిష్కారంలో భాగంగా సోమవారం పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు న్యాయం చేకూర్చడానికి, ఇకముందు అటవీ భూములు ఆక్రమణలకు గురికాకుండా సంరక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ఫారాలను గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచితంగా అందిస్తారని పేర్కొన్నారు. ఫారం నింపడానికి రానివారికి గ్రామ కార్యదర్శులు సహకరించాలని కలెక్టర్ చెప్పారు. దరఖాస్తు ఫారాలతోపాటు ఆధార్‌కార్డు, కాస్తు ధ్రువపత్రాలు జత చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. వచ్చిన దరఖాస్తులను గ్రామ కమిటీ నిర్దారించి జిల్లా కమిటీకి పంపిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అర్హులైన ఎస్టీలకు హక్కు పత్రాలు అందిస్తామని తెలిపారు. ఈ భూములు ఇతరులకు అమ్ముకునేందుకు వీలుండదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు మోతీలాల్, చంద్రయ్య, ప్రత్యేకాధికారి పుష్పలత, ఎంపీపీ అరవిందరావు, తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, సర్పంచ్ నర్సమ్మ పాల్గొన్నారు.
అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా సంరక్షించేందుకు చర్యలు
అటవీ భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు న్యాయం చేకూర్చుటకు, ఇకముందు అటవీ భూములు అక్రమణకు గురికాకుండా సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి జానకీరామ్ అన్నారు. సోమవారం జిల్లా అటవీశాఖ అధికారి అధ్యక్షతన పోడు భూముల శాశ్వత పరిష్కారంలో భాగంగా రంగారెడ్డిజిల్లాలోని మంచాల, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లోని తాళ్లపల్లిగూడ, తిప్పాయిగూడ, రంగాపూర్, సాహెబ్‌నగర్, కుత్బుల్లాపూర్, తట్టిఅన్నారం, పోల్కంపల్లి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందించేందుకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన ఫారాలను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉచితంగా అందిస్తారన్నారు. ఫారం నింపరానివారికి గ్రామ కార్యదర్శులు సహకరించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలతో పాటు ఆధార్‌కార్డు, కాస్తు ధ్రువపత్రాలు జతచేయాలని తెలిపారు. ఇచ్చిన దరఖాస్తులను గ్రామ కమిటీ నిర్ధారించి జిల్లా కమిటీకి పంపనున్నట్లు చెప్పారు. అర్హులైన ఎస్టీలకు హక్కు పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు. గ్రామ సభల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గిరిజన సంక్షేమశాఖ, రెవెన్యూశాఖ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.