పరిగి/షాద్‌నగర్, నవంబర్ 8 : రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ ప్రకారంమద్యం దుకాణాల రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు లక్కీ డ్రా ద్వారా కేటాయించినట్లు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు నిఖిల, అమయ్‌కుమార్ తెలిపారు. సోమవారం వారు ఆయా జిల్లాల కలెక్టరేట్లలో నిర్వహించిన సమావేశాల్లో మద్యం దుకాణాల రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టారు. గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని 234 రిటైల్ మద్యం దుకాణాలకుగాను సరూర్‌నగర్ డివిజన్లో ఎస్టీలకు 2, ఎస్సీలకు 11, గౌడ కులస్తులకు 25 మద్యం దుకాణాలు కేటాయించామన్నారు. శంషాబాద్ డివిజన్లో ఎస్సీలకు 6, గౌడ్లకు 9, మిగతా 181 మద్యం దుకాణాలను జనరల్ కేటగిరికి ఇవ్వనున్నట్లు కలెక్టర్ అమయ్‌కుమార్ చెప్పారు. మద్యం షాపుల ప్రక్రియను పూర్తి పారదర్శకతతో చేపడుతారని, వ్యాపారులు మద్యం దుకాణాల కేటాయింపుపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్రావు, శంషాబాద్ డివిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, అధికారులు శ్రీధర్, నీరజరెడ్డి, రామేశ్వరి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లాలో ఎస్సీలకు 9, ఎస్టీలకు 2, గౌడ్లకు 6 చొప్పున 17 మద్యం దుకాణాలు కేటాయించినట్లు కలెక్టర్ నిఖిల తెలిపారు. జిల్లా పరిధిలో ప్రస్తుతం 46 మద్యం దుకాణాలుండగా కొత్తగా మద్యం పాలసీకి ఆమోదముద్ర వేయడంతో జిల్లాలో అదనంగా 13 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనుండడం వల్ల జిల్లావ్యాప్తంగా మద్యం దుకాణాల సంఖ్య 59కి చేరింది. 17 దుకాణాలకు సంబంధించి ఎస్టీలకు మోమిన్‌పేట్‌లోని దుకాణం నం.1, పరిగి మున్సిపాలిటీలోని నం.3, ఎస్సీలకు మన్నెగూడలోని నం.2, మర్పల్లిలోని నం.1, నవాబుపేట, బంట్వారం, బషీరాబాద్‌లోని నం.1, పరిగి మున్సిపాలిటీలోని నం.5, వికారాబాద్ మున్సిపాలిటీలోని నం.1, తాండూరు మున్సిపాలిటీలోని నం.8, యాలాలలోని మద్యం దుకాణం, గౌడ్లకు గోకఫస్లాబాద్, తాండూరు మున్సిపాలిటీలోని నం.6, కులకచర్ల నం.1, కోట్‌పల్లి, పరిగి మున్సిపాలిటీలోని నం.1, మల్కాపూర్‌లోని మద్యం దుకాణాలు రిజర్వు చేయబడ్డాయి. మిగతా 42 మద్యం దుకాణాలకు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.