
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం
అర్హులకు న్యాయం చేయాలన్నదే సీఎం ఆలోచన
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది : మెదక్ కలెక్టర్ హరీశ్
మెదక్, నవంబర్ 8 : గతంలో పట్టా ఇచ్చినా పొజిషన్ చూయించక చాలా సమస్యలు వచ్చాయని, వాటి శాశ్వత పరిష్కారానికి చమరగీతం పాడాలనే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో పోడు, అటవీ సంరక్షణపై ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన అఖిల పక్షం జిల్లా స్థాయి అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. అటవీ భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న నిజమైన గిరిజనులు ప్రభుత్వ పథకాలైన రైతు బంధు, రైతు బీమా వంటి సౌకర్యాలు పొందలేకపోతున్నారని, 2005కు ముందు 75 ఏండ్లు సాగు చేస్తున్న రైతులను గుర్తించి హక్కు పత్రాలు అందించడంతో పాటు అటవీ ఆక్రమణ, పునర్జీవనం చేయాలని సీఎం కేసీఆర్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ పోడు భూముల సమస్యలకు ఇంతటితో చెక్ పెట్టి, అర్హులకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన అని, ప్రజాప్రతినిధులు విమర్శలకు పోకుండా అధికారులకు సహకారమందించాలని కోరారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ చేగుంట మండలం ఇబ్రహీంపూర్, నార్సిం గి మండలం భీంరావుపల్లి, చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లి, పోతాన్‌పల్లి, మాసాయిపేట తదితర గ్రామాల్లో దశాబ్దాల నుంచి పోడు సాగు చేస్తున్నారని, ప్రత్యేక అధికారిని నియమించి ఆ గ్రామాల్లో సర్వే చేపట్టి నిరక్షరాస్యులైన గిరిజనులు, గిరిజనేతరులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.
కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేస్తూ అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం చేయడంతో పాటు అడవుల సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. పోడుసాగు చేస్తున్న నిజమైన గిరిజన, గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించడంతో పాటు, ఇక ముందు అటవీ భూములు ఆక్రమణ జరగకుండా వాటి పునర్జీవనానికి అటవీ రక్షణ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఈ నెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శరవణన్, డిఎఫ్వో రవిప్రసాద్, జ్ఞానేశ్వర్, ఆర్డీవో సాయిరాం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణరెడ్డి, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.