
చకచకా కొనసాగుతున్న నిర్మాణ పనులు
త్వరలో అందుబాటులోకి బ్రిడ్జి
వంతెనతో పాటురోడ్డు నిర్మాణ పనులు పూర్తి
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
అమీన్పూర్, నవంబర్ 8 : కొన్నేండ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు సర్కారు శాశ్వత పరిష్కారం చూపింది. దీంతో ట్రాఫిక్ సమస్యతీరడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బీరంగూడ నుంచి కిష్టారెడ్డిపేట్ రహదారిపై ప్రయాణించే ప్రజలు నరకయాతన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారితోపాటు వంతెన చాలా ఇరుగ్గా ఉండడంతో రోడ్డుపై ప్రయాణించే వాహదారులకు ఈ బ్రిడ్జి వద్దకు రాగానే ముచ్చేమటలు పట్టేవి. నిత్యం ఈ రహదారిపై లక్షలాది వాహదారులు ప్రయాణిస్తుంటారు. దీంతో రెండు వైపులా నుంచే వచ్చిపోయే వాహనాలు ట్రాఫిక్ జాంతో ప్రయాణికులు ఈ బ్రిడ్జి వద్ద ఎంతో కాలయాపనకు గురవుతున్నామని అవేదన వ్యక్తం చేసేవారు. ఈ సమస్య పరిష్కారం కోసం గత ప్రభుత్వాల కాలం నుంచి ఎంతో మంది ప్రజా ప్రతినిధులకు విన్నవించని రోజంటూ లేదు. ఈ బ్రిడ్జి రహదారిపై అనేక సార్లు రాస్తారోకోలు, ధర్నాలు నిరసనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇలాంటి సమస్యలకు చెక్ పడుతున్నాయని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు ఈ రహదారి, బ్రిడ్జి నిర్మా ణ పనులే నిదర్శనమని చెప్పవచ్చు. 2019 జనరల్ ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ పటాన్చెరు వచ్చిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అందుకు ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయిస్తానని హమీ ఇచ్చారు. అనుకున్న విధంగానే రహదారితో పాటు భారీ వంతెనను నిర్మిస్తున్నారు.