భూపాలపల్లి రూరల్, నవంబర్ 7: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంతో పాటు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు నూతన ఆవిష్కరణ పోటీలు నిర్వహిస్తున్నది. యూనిసెఫ్ సహకారంతో తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఇంక్విలాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు నూతన ఆవిష్కరణల పోటీలను ఛాలెంజ్- 2021 పేరిట వివిధ దశల్లో నిర్వహించనున్నారు. పాఠశాలలే కొత్త అంశాలు రూపొందించేందుకు వేదికగా మారాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు మాత్రమే పాల్గొననున్నారు. ఇందులో భాగంగా ఛాలెంజ్- 2021 పోటీల్లో జిల్లాలోని ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనేందుకు చొరవ చూపాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ఆవిష్కరణలకు చర్యలు చేపట్టారు.
దశల వారీగా కార్యక్రమం
ప్రతి పాఠశాల నుంచి గణితం, సామాన్య శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు TSIC2021 Register లింక్ ద్వారా నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో తప్పని సరిగా వాట్సాప్ నంబరు మాత్రమే నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న ఉపాధ్యాయులకు ఈనెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో మొదట శిక్షణ ఇస్తారు. రెండో దశలో ఇన్నోవేషన్ సలహాల కోసం విద్యార్థులకు ఈనెల 22 నుంచి వచ్చేనెల 17వ తేదీ వరకు అవగాహన కల్పిస్తారు. మూడో దశలో ఆసక్తి ఉన్న వారిని గుర్తించి బృందాలుగా విభజిస్తారు. ఒక్కో జట్టులో నలుగురు, ఐదుగురు ఉండేలా చూస్తారు. విద్యార్థులు తమ అలోచనలతో రూపొందించిన ఆవిష్కరణలను వచ్చేనెల 17 నుంచి 31 వరకు మూల్యాంకనం చేస్తారు. వచ్చే సంవత్సరం జనవరి 2 నుంచి 25 వరకు జిల్లా స్థాయిలో ప్రాథమిక నమునా శిబిరాన్ని నిర్వహించనున్నారు. చివరకు జిల్లా స్థాయిలో తుది ప్రదర్శలను జనవరి 27 నుంచి 31 వరకు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర స్థాయి గ్రాండ్ ఫినాలేను ఫిబ్రవరి 5 లేదా 6 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయించారు.
జిల్లాలో నమోదు ప్రక్రియ ప్రారంభం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 538 ఉన్నాయి. వీటిలో ప్రాథమికోన్నత పాఠశాలలు 50, ఉన్నత పాఠశాలలు 115 ఉన్నాయి. ఇప్పటికే వివిధ పాఠశాలలు ఛాలెంజ్- 2021 పోటీల్లో పాల్గొనేందుకు నమోదు ప్రక్రియను ప్రారంభించాయి. కొత్త ఆవిష్కరణల రూపకల్పనలో ప్రతిభను చాటేందుకు విద్యార్థులు నిమగ్నమయ్యారు. జిల్లా విద్యాధికారి, జిల్లా సైన్స్ అధికారి, ఇన్చార్జి ఉపాధ్యాయులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసేందుకు చర్యలు చేపడుతున్నారు.