పోడు సమస్య పరిష్కారంపై చిగురించిన ఆశలు
ఎకరం వరకు సాగు చేసినవారికి న్యాయం
గిరిజనేతరుల సాగుపై ఉక్కుపాదం
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనపై గిరిజనుల్లో హర్షం
దరఖాస్తుల స్వీకారానికి త్వరలోనే శ్రీకారం
ఏజెన్సీ రైతులకు వరంలా ముఖ్యమంత్రి నిర్ణయం
ములుగు, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : పోడు సమస్య పరిష్కారానికి శాసన సభలో సీఎం కేసీఆర్ మంగళవారం కీలక ప్రకటన చేయడంతో అడవి బిడ్డలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కార మార్గం సుగమమైందని గిరిజనులు సంబురపడుతున్నారు. అరెకరం నుంచి ఎకరం వరకు సాగు చేసిన రైతులకు పట్టాలు అందనున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేల ద్వారా త్వరలోనే దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ సమయంలోనే మరింత భూమిని ఆక్రమించబోమని హామీ పత్రాలు కూడా తీసుకోనుంది. ములుగు జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం జరిగినట్లు రెవెన్యూ, ఫారెస్టు రికార్డులు చెబుతున్నాయి. సీఎం నిర్ణయంతో వేలాది మంది పోడు రైతులకు లబ్ధిచేకూరనుంది.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక కష్టాలు పడిన ప్రజల సమస్యలను స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నది. తాజాగా పోడు భూముల సమస్యపై దృష్టి సారించింది. శాసన సభ సమావేశాల్లో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్ పోడు సమస్యపై కీలక ప్రకటన చేశారు. దీంతో ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గిరిజనులు సీఎం నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అవినీతి కారణంతో పాటు రైతులకు పోడు చట్టాలపై సరైన అవగాహన కల్పించకపోవడంతో అమాయక రైతులు జీవనోపాధి కోసం అటవీ ప్రాంతాన్ని అక్రమించుకుని పోడు వ్యవసాయాన్ని చేపట్టారు. ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం(నూగూరు), తాడ్వాయి మండలాల్లో ఎక్కువగా పోడు భూముల సమస్య ఉంది. అదేవిధంగా ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాలల్లోని పలు గ్రామాల్లో సాంకేతిక కారణాలతో పట్టా భూములకు సైతం పోడు భూములుగా రికార్డుల్లో నమోదయ్యాయి. ఏజెన్సీ గ్రామాల్లోని కొన్ని భూములు అటవీ శాఖ పరిధిలోని రికార్డులో ఉన్నందున ఆయా గ్రామాల్లో రైతులకు సైతం పట్టాలు అందని పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మండలాల్లో సుమారు వెయ్యి నుంచి 2వేల ఎకరాల్లో పోడు వ్యవసాయం జరిగినట్లు రెవెన్యూ, ఫారెస్టు అధికారులు తెలుపుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారం దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అర్హులైన పోడు రైతుల సంఖ్య, భూ విస్తీర్ణ సంఖ్య సైతం తేలనుంది. 2018 ఎన్నికల ప్రచార సభలో సైతం సీఎం కేసీఆర్ పోడు రైతులందరికీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం చేపడుతున్న కార్యాచరణతో నెరవేర్చనున్నారు.
పరిష్కారానికి త్వరలో కార్యాచరణ
అరెకరం నుంచి ఎకరం సాగు చేసుకునే గిరిజన రైతులకు పట్టాలు అందజేసి, వందల ఎకరాలు సాగు చేసుకుని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించి పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం ఎంత విస్తీర్ణం పోడు సాగు చేస్తున్నారో తెలుసుకునేందుకు ఎమ్మెల్యేల ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఎకరం లోపు భూములు సాగు చేసుకునే రైతులకు పరిష్కార మార్గాన్ని కనుగొనే సమయంలో మరింత భూమిని ఆక్రమించుకోబోమని రైతుల ద్వారా హామీ పత్రాలను స్వీకరించనున్నారు.